- ప్రభుత్వానికి, ఎండోమెంట్ శాఖ మంత్రికి పంపిన నివేదికలో తేడాలు!
- వేధిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల కొరత
- ఏండ్లుగా ఖాళీగానే పోస్టులు
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల వివరాల్లో స్పష్టత లేదు. అసలు ఆ శాఖలో మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్న విషయంలో అధికారుల్లో క్లారిటీ కరువైంది. ప్రభుత్వానికి పంపిన జాబితా, సంబంధిత శాఖ మంత్రికి పంపిన ఖాళీల వివరాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన జాబితానే మళ్లీ పంపించారా, లేక ఉద్యోగుల ప్రమోషన్లతో పోస్టులను ఎక్కువ, తక్కువ చూపారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అసిస్టెంట్ కమిషనర్లు 27 మంది ఉండగా.. కేవలం 13 మంది పనిచేస్తున్నారు. 14 ఖాళీలు ఉన్నాయని, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పరిధిలో 4 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని నివేదిక ఇచ్చారు. అయితే, మిగిలిన పోస్టుల పరిస్థితిపై స్పష్టత లేదు. ‘‘గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 39 మందికి 33 మంది పనిచేస్తున్నారు. 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టు పరిధిలో 5 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గ్రేడ్ -3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 127 మందికి 67 మంది పనిచేస్తున్నారు. 60 ఖాళీగా ఉన్నాయి. 54 మందిని డైరెక్టు రిక్రూట్ మెంట్లో పరిధిలో భర్తీ చేయాల్సి ఉంది. అలాగే, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16 ఉండగా.. ముగ్గురు పనిచేస్తున్నారు. 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 14 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో భర్తీ చేయాల్సి ఉంది” అని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, మంత్రికి ఇచ్చిన లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయని సమాచారం. గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 39 మందికి 34 మంది ఉండగా.. ఐదుపోస్టులు ఖాళీగా ఉన్నాయని, గ్రేడ్ -2 ఆఫీసర్లు 67 మందికి 63 మంది పనిచేస్తుండగా.. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు.
వేధిస్తున్న ఈవోల కొరత
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వినూత్న కార్యక్రమాలతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తుండటంతో పాటు దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చరిత్రాత్మక ఆలయాలు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిపై ఫోకస్ పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాలపై ఫోకస్ చేసింది. వాటి అభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తున్నది. అయితే, ఈ పనులను పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆలయాల పర్యవేక్షణలో ఈవోలు ప్రధాన పాత్ర పోషిస్తారు. వారి కొరతతో ఆలయాల ప్రగతికి అడ్డంకిగా మారుతున్నది. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాలు ఉండగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 233 మంది ఈవోలు ఉండాలి. కానీ, 164 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 69 మంది ఈవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ పాలనలోనే దేవాదాయ శాఖలో ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఖాళీలకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ.. నాటి ప్రభుత్వానికి నివేదించినా ఖాళీలు భర్తీ చేయలేదు.