
సకల శాస్త్రాలకు ఆధారం లాంటిది, నాగరికతకు అద్దం లాంటిది గణితం. పైథాగరస్ అన్నట్టు ‘సంఖ్యలే విశ్వ శాసనకర్తలు’. ప్రపంచ ఏకైక భాష గణితం’ అని నాథా నియల్ వెస్ట్ అందుకే అన్నారేమో. వేదాంగ జ్యోతిష్యం సైతం.. నెమళ్లకు శిఖవలె, పాములకు మణివలె, సకల శాస్త్రాలకు అగ్ర భాగాన గణితం ఉంటుందని జోస్యం చెప్పింది. సంకేతాలు, గుర్తులు, గుర్తుంచుకోవలసిన నియమాలు, సూత్రాలు ఇలా ఎన్నెన్నోగల శాస్త్రం గణితం.
గణిత అధ్యయనం అంటే.... కారణం, పరిమాణం, క్రమం, ఆకృతిల మధ్య తార్కిక సంబంధానికి సంబంధించినవి ఎన్నో ఉంటాయి. అందుకే, తార్కికం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, అభిప్రాయాలను, భావాలను పంచుకునే నైపుణ్యం గణిత శాస్త్రం సొంతం. ఎన్నో అవసరాలకు గణితం అత్యావశ్యకమైనది.
ఔషధాలు, వాతావరణం, మెడిసిన్, ఇంజినీరింగ్, వ్యాపారం, వాణిజ్యం, అర్థశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, వృక్ష, జంతు తదితర శాస్త్రాలన్నింటితోనో ముడిపడి తన ప్రత్యేకతను, విశిష్టతను చాటుకుంటోంది.
గణితంలో వెనుకబాటుకు కారణం?
గణిత శాస్త్రం వరుస క్రమాలపై ఆధారపడి ఉంటుంది. నిచ్చెనల పద్ధతిలో బోధన ఉంటుంది. వినేటప్పుడు ఏ(స్టెప్ ) అడుగు తప్పినా గందరగోళంగా ఉంటుంది. ఎంతో ఏకాగ్రత, పట్టుదల అవసరం. అలాగే పునాది గణిత భావనలు అర్థం చేసుకోవడంలో వెనుకబాటు వల్ల, అధునాతన అంశాలను అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుంది. తప్పులు చేస్తామనే భావనతో భయం, ఆందోళన కలుగుతుంది. దానికితోడు ప్రతికూల నమ్మకం శారీరక, మానసిక క్షోభను కలిగిస్తుంది.
తోటివారి ఒత్తిడి వల్ల, నిరుత్సాహం వల్ల, ఆటంకం పెట్టడం వల్ల, సబ్జెక్టు నేర్చుకోవడంలో వెనుకంజ వేస్తారు. దీనికి తోడు ఆకర్షణలేని బోధన, సరిలేని బోధన వల్ల విద్యార్థులు ఆనందంగా నేర్చుకోలేకపోతారు. పాఠశాల వెలుపల, గృహంలో అదనపు సహాయం అందకపోవడం, అభ్యసనా సామగ్రి లోటు లాంటివి కూడా విద్యార్థిని గణిత అభ్యాసనలో వెనుకంజకు కారణాలవుతున్నాయి.
మానసిక ప్రతికూల సందర్భాలు
గణిత అభ్యాసనలో విద్యార్థులకు మానసికపరమైన ప్రతికూల సందర్భాలూ ఉన్నాయి. అందులో ఒకటి న్యూమరో ఫోబియా (అరిథ్ మే ఫోబియా). దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
విద్యార్థి సంఖ్యలతో వ్యవహరించేటప్పుడు, సంఖ్యా సమాచారంతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు విపరీతమైన భయం, ఆందోళన, వణుకుతో చెమటలు పట్టడం, నిస్సహాయునిగా మారడం జరుగుతుంది. మరొక అంశం డైస్కాలకులియా. దీనివల్ల ప్రాథమిక అంకగణిత భావనలైన.. కూడిక, తీసివేత, గుణకారం, భాగహార కార్యకలాపాలతో సమస్యలు, సంఖ్యలను అర్థం చేసుకోవడం, తారుమారు చేయడం, తిరిగి రాసుకోవడంలో కష్టపడటం జరుగుతోంది. అవరోధాల మధ్య, ఆటంకాల మధ్య గణితం అర్థం చేసుకొని, ప్రజ్ఞావంతుడు కావాలంటే కష్టసాధ్యమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా గణితాన్ని మిగతా సబ్జెక్టులతో సమానంగా చూడకూడదు.
విద్యార్థుల ముందంజకు సూచనలు
విద్యార్థులు క్రమం తప్పకుండా సాధన చేయటంతోపాటు నిత్యజీవితంలో గణితాన్ని భాగం చేసుకోవాలి. స్థిరమైన అభ్యాసమే గణితానికి అవసరమైన నైపుణ్యం అని నమ్మి ఆచరించటం చేయాలి. అదేవిధంగా, సానుకూల మనస్తత్వం ఏర్పరచుకొని అదనపు బోధనను, ఇంటరాక్షన్ ను పొంది రాణించే ప్రయత్నం విద్యార్థులు చేయాలి. ఇక రుగ్మతల విషయానికొస్తే... కృత్రిమ మేధతో విద్యార్థుల బలహీనతలను గుర్తించడం, విజయం పొందేందుకు తగిన సూచనలు అందించే ‘ఆల్గారిథం’ లను రూపొందించడం జరుగుతోంది.
చదువులో వెనుకంజను పర్యవేక్షించడానికి, ఆసక్తిని పెంచుకోవడానికి, కృత్రిమ మేధతో ప్రయోగాలు విజయవంతంగా జరుగుతున్నాయి. గ్రేడుల నిర్ధారణ జరిగిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ ఏర్పాటు చేసి, ఆయా గ్రేడ్ విద్యార్థులకు ఉండాల్సిన ‘కరికులం’ అనుగుణమైన బోధన జరుగుతుంది.
తద్వారా గణితంలో విద్యార్థులు రాణించి మంచి ర్యాంకులు, క్రెడిట్లను పొందుతారు. ఇలాంటి శాస్త్రీయమైన పద్ధతులను, వాస్తవ సన్నివేశాలను, ఉపయోగిస్తూ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో నిరంతరం విద్యార్థి కృషి చేస్తే భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమైన ‘గణిత అభ్యాసం’ చక్కగా ప్రాథమిక దశ నుంచే కొనసాగుతుంది.
- సుతారి మురళీధర్, ఉపాధ్యాయుడు -