ఫామ్​హౌస్​లో సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా : సీఎం రేవంత్​రెడ్డి

ఫామ్​హౌస్​లో సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా : సీఎం రేవంత్​రెడ్డి
  • రుణమాఫీ సహా అన్ని పథకాల లెక్కలు చెప్త
  • కేసీఆర్​కు సీఎం రేవంత్ సవాల్
  • బలంగా కొడ్తవా.. ముందు సక్కగా నిలబడుడు నేర్చుకో 
  • ప్రజలెవ్వరూ బాధ పడ్తలేరు.. అధికారం పోయి నువ్వే బాధపడ్తున్నవ్ 
  • తులం బంగారానికి అమ్ముడుపోయారని ప్రజలను అవమానిస్తవా? అని ఫైర్ 

షాద్ నగర్, వెలుగు: ‘ఫామ్ హౌస్‌లో ఉంటూ అక్కడికి వచ్చినోళ్లకు సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా..’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్​విసిరారు. ‘‘స్పీకర్​ పర్మిషన్ ​తీసుకుని అసెంబ్లీ పెడ్తం. ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదిక మీద చర్చిస్తం. నువ్వు అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలే కాదు.. మేం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లెక్కలూ చెప్తం. అక్కడే నువ్వా? మేమా? తేల్చుకుందాం’’  అని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్దలోని ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్​కు చిత్తశుద్ధి, నిజాయితీ, నాయకత్వం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ‘‘ఆయన (కేసీఆర్) కొడ్తే బలంగా కొడ్తడట. కొట్టుడు కాదు.. ముందు నువ్వు సక్కగా నిలబడుడు నేర్చుకో.. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఫామ్​హౌస్​లో పడుకొని నీకున్న మెదడు కూడా పోయినట్లు ఉంది” అని విమర్శించారు. ‘‘డిసెంబర్​లో అధికారం పోయింది.. జనవరిలో డిపాజిట్లు గల్లంతైనయ్.. ఇప్పుడు ఫామ్​హౌస్​లో మతి పోయినట్టు వ్యవహరిస్తున్నడు. అల్లుడు, కొడుకును అచ్చోసిన ఆంబోతుల్లా తెలంగాణ మీదికి కేసీఆర్ వదిలాడు. సోషల్ మీడియాలో 4 కోట్ల మంది ప్రజలు తమను కోరుకుంటున్నారని కేసీఆర్ అంటున్నారు. దీన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. 4 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం అధికారం కోల్పోయి బాధపడుతున్నట్లుంది” అని రేవంత్​ అన్నారు. 

మాట తప్పడమే కేసీఆర్ నైజం.. 

ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ కేసీఆర్.. ఫామ్ హౌస్​లో కూర్చొని సోది చెప్పుడు కాదు.  దమ్ముంటే అసెంబ్లీకి రా.. మా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని లెక్కలతో సహా వివరిస్తాం” అని సవాల్ విసిరారు. ‘‘గత పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్..​ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైండు. ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పి, దివాలా తీయించిండు. మిగులు బడ్జెట్​తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండు. అధికారంలో ఉన్నప్పుడు ‘పాడిందే పాడరా..’ అన్నట్టు వ్యవహరించిండు” అని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 50 వేల మందికి రూ.2 లక్షల చొప్పున రూ. 21 వేల కోట్లను మాఫీ చేశాం. మహిళలకు ఫ్రీ బస్సు, సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ కూలీలకు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు చేస్తున్నం. ఇచ్చిన మాట తప్పడం కేసీఆర్ నైజం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ సిద్ధాంతం” అని అన్నారు. 

కేసీఆర్ లెక్క హామీలు ఎగ్గొడ్తలేం.. 

జహంగీర్ పీర్ దర్గా, వేములవాడకు నిధులు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరును ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు. కానీ ఎవరూ బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేం ఎగ్గొడ్తలేం. గత ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా, అధైర్య పడకుండా పథకాలు అమలు చేస్తున్నాం” అని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా గాలి ఊదితే కేసీఆర్ కొట్టుకుపోతారని అన్నారు. తులం బంగారానికి అమ్ముడుపోయారంటూ తెలంగాణ ప్రజలను అవమానించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ కు జనంతో సంబంధాలు తెగిపోయాయి. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు మేము ఇచ్చాం. కేసీఆర్ అబద్ధాలు చెప్పి చెప్పి ఓడిపోయారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే రియల్ ఎస్టేట్ కుప్పకూలింది’’ అని అన్నారు. 

లైక్స్ ఎక్కువొస్తే గొప్పనా? 

భారత జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై తమ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి.. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు బాగా లైకులు వచ్చాయట. పెయిడ్​ బ్యాచ్​తో లైక్​లు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు. ఆ వెయ్యి రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్లడం తప్ప. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మమ్మల్ని అభినందించడానికి మనసు రాకపోతే.. అదే ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌లో పడుకోవాలి’’ అని అన్నారు.  

మొగిలిగిద్దకు 16 కోట్లు.. 

150 ఏండ్లు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద జిల్లా పరిషత్ పాఠశాలకు అడ్వాన్స్డ్​ టెక్నాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎందరో ప్రముఖులు ఈ పాఠశాలలో చదువుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ పాఠశాలను పట్టించుకోలేదన్నారు. మొగిలిగిద్ద గ్రామానికి, పాఠశాల అభివృద్ధికి రూ.16 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

మీరు చేయనివి.. మేం చేశాం 

గత ప్రభుత్వ హయాంలో టీచర్ల నియామకాలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రాగానే 11 వేల టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ‘‘గతంలో నోటిఫికేషన్లు ఇస్తే ఏండ్ల తరబడి నియామక ప్రక్రియ జరిగేది. కానీ మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేసింది. గత ప్రభుత్వం యూనివర్సిటీలను పునరావాస కేంద్రాలుగా మార్చింది. మా ప్రభుత్వం రాగానే వీసీలను నియమించాం. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచాం. గత ప్రభుత్వం డైట్‌‌‌‌‌‌‌‌, కాస్మోటిక్‌‌‌‌‌‌‌‌ చార్జీలను పెంచలేదు. మేం వచ్చాకే పెంచాం. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేశాం. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా 35 వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే స్థాయికి చేరుకున్నాం. విద్యపై చేసేది ఖర్చు కాదు.. భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి. అందుకే విద్యాశాఖను నా వద్దే ఉంచుకున్నాను” అని రేవంత్​ రెడ్డి తెలిపారు.