
హనుమకొండ/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ప్రకటించడం అన్యాయం అని పెన్షనర్లు విమర్శించారు. గురువారం హనుమకొండ, మహబూబాబాద్ కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించారు. హనుమకొండలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం, మహబూబాబాద్‌లో యూనిట్ అధ్యక్షుడు లింగయ్య మాట్లాడారు. ఉద్యోగులు గర్వపడేలా పీఆర్సీ ఇస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎవరినీ సంప్రదించకుండా ఐదు శాతం ఐఆర్ ప్రకటించడం అవమానపరచడమే అన్నారు.
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఐఆర్‌ను 20 శాతానికి పైగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు చెల్లించాలని, ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. హనుమకొండలో పెండ్యాల బ్రహ్మయ్య, నారాయణగిరి వీరన్న, ప్రభాకర్‌రెడ్డి, నిర్మల, సత్యనారాయణ పాల్గొన్నారు.