సికింద్రాబాద్, వెలుగు: బ్యూటిఫికేషన్ పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఆయనను కలిసి తమ సమస్యను విన్నవించారు.
జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, షాపుల ముందు ఫుట్ పాత్లు ఎత్తుగా నిర్మిస్తున్నారని చెప్పారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎవరూ ఆందోళన చెందవద్దని, సంబంధిత అధికారులతో కలిసి శనివారం అమీర్ పేటలో పర్యటిస్తానని చెప్పారు. వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్మిత్ సింగ్, వైస్ చైర్మన్ ఉత్తమ్ రాజ్ పురోహిత్, అడ్వైజర్ అశోక్ పురోహిత్ తదితరులు ఉన్నారు.