రోహిత్‌పై వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. ఇందులోకి నా పార్టీని తేవొద్దు: షామా మొహమ్మద్

రోహిత్‌పై వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. ఇందులోకి నా పార్టీని తేవొద్దు: షామా మొహమ్మద్

కాంగ్రెస్ మహిళా నేత, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ షామా మొహమ్మద్.. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ శరీరాకృతిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బీజేపీ శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడినట్టైంది. ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న హస్తం పార్టీ..  సదరు మహిళా నేతను పోస్టు డిలీట్ చేయాలని సూచించింది. దాంతో ఆమె పోస్ట్ డిలీట్ చేశారు.

ఇప్పుడు, మరోసారి ఈ విషయంపై స్పందించిన షామా మొహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, తన పార్టీని ఇందులోకి తీసుకు రావొద్దని కోరారు.

ALSO READ | రోహిత్ శర్మపై వివాదస్పద ట్వీట్.. కాంగ్రెస్ ఎంట్రీతో పోస్ట్ డిలీట్ చేసిన షామా మొహమ్మద్

"మనం ఒకరి ఫిట్‌నెస్ గురించి మాట్లాడవచ్చు. అందులో తప్పేంటి..? నేను ఫిట్‌గా ఉన్నాను కాబట్టి, నేను అతని ఫిట్‌నెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు ఈ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు?.." అని షామా మొహమ్మద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. క్షమాపణలు చెప్పాల్సింది పోయి సమర్థించుకుంటావా అని ఆమెను మరింత విమర్శిస్తున్నారు.

అసలు ఈమె ఏమన్నదంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ ప్రదర్శనను ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ మహిళా నేత షామా మొహమ్మద్ తన సోషల్‌ మీడియా ఖాతాలో రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా లావుగా ఉంటాడని, అతను బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్‌ అయ్యారని.. సచిన్, ద్రవిడ్‌, గంగూలీ, కోహ్లీ, ధోనీలతో పోల్చితే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని సదరు పోస్టులో పేర్కొన్నారు. ఇది రాజకీయ విమర్శలకు దారితీసింది.