ముషీరాబాద్, వెలుగు: దేశంలో అత్యంత జనాదరణ పొందిన పెట్ డాగ్స్లో పగ్స్ జాతికి చెందినవి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయని పీపుల్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) ఎన్జీవో పేర్కొంది. మంగళవారం పెటా ఎన్జీవో సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. పగ్స్ జాతి డాగ్స్ వేషాధారణలో ఆక్సిజన్ తీసుకుంటున్నట్లు ప్రదర్శన చేపట్టారు. ఎన్జీవో సంస్థ ప్రతినిధులు ఉత్కర్ష్ గార్గ్, దేవిన్ సోనం మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్లో అత్యంత జనాధారణ పొందిన పెట్ డాగ్స్ జాతుల్లో ఒకటిగా పగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
వాటి చదునైన ముఖం, చిన్న ముక్కుతో జీవించడం కోసం ఇబ్బంది పడుతుంటాయన్నారు. శ్వాసకోశ సమస్యలకు శస్త్ర చికిత్స కూడా అవసరమని, వాటిని కొనవద్దని సూచించారు. ఆ శునకాలను పెంచుకుంటే.. శ్వాస కోశ, ఆరోగ్య సమస్యలతో వాటి జీవితకాలం తగ్గుతుందని పేర్కొన్నారు. పగ్స్ పడే బాధలను హైదరాబాద్ వాసులకు తెలియజేసేందుకే అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రసిద్ధి చెందిన దేశీయ కుక్కలను దత్తత తీసుకొని పెంచుకోవాలని సూచించారు.