హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు

హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు

హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 

చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో  అరగంట నుంచి వర్షం నాన్ స్టాప్ గా పడుతోంది.  దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ఈ క్రమంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపై ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వందలాది వాహనాలు ఆగిపోయాయి.  

మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.  అవసరమైతే తప్ప బయటికి రాకపోవడమే బెటర్ అని సూచించారు.  లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

మరోవైపు రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. ఆ తర్వాత మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.