యాదాద్రి, వెలుగు : సమస్యలను పరిష్కరించని రాజకీయ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని యాదాద్రి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో ఓ కుటుంబంలోని ఓటర్లు తేల్చిచెప్పారు. ఓట్లు అడగడానికి తమ ఇంటికి ఎవరూ రావద్దని సూచించారు. ఈ మేరకు తమ ఇంటి గేటుపై ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. మోత్కూరులోని బాలుర గురుకుల పాఠశాల నుంచి మెయిన్‌రోడ్డు వరకూ మురికి కాలువ లేదని తెలిపారు.
దుర్వాసనతో పాటు దోమలతో అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున తమ సమస్యను ఎత్తి చూపుతూ ఆ కుటుంబ సభ్యులు ‘‘మా సమస్యలు నాయకులకు పట్టవు. ఓట్ల కోసం మా ఇంటికి రాకండి’’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు.