బలవంతంగా ఏకగ్రీవాలొద్దు.. ప్రభావితం చేసే వారిపై షాడో టీమ్స్

బలవంతంగా ఏకగ్రీవాలొద్దు.. ప్రభావితం చేసే వారిపై షాడో టీమ్స్
  • పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్
  • ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్

కర్నూలు: భిన్నాభిప్రాయంలో ఏకాభిప్రాయం సాధించడం మంచిదే.. అది ప్రజాస్వామ్య బద్దంగా.. అందర్నీ మెప్పించి ఒప్పించే రీతిలోనే ఉండాలిగాని.. బలవంతంగా ఏకగ్రీవం చేయాలని ఎవరూ ప్రయత్నించరాదని ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. అభివృద్ధి పేరుతోనో.. ప్రలోభాలకు గురిచేసి.. ప్రజాస్వామ్య విరుద్ధవంగా… దౌర్జన్యంగా బలవంతం చేయాలని ప్రయత్నిస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం.. ఏర్పాట్లు పరిశీలించేందుకు ఇవాళ శుక్రవారం జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలుత అనంతపురం ఆ తర్వాత కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో అధికారులు.. పోలీసులతో స్వయంగా మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో అడిషనల్ డీజీపీ ఎన్.సంజయ్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ  జి.వీరపాండియన్, డి.ఐ.జి. వెంకట్రామి రెడ్డి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మోహిద్దీన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు ప్రభావితం చేసే వారిపై షాడో టీమ్స్

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేసే వారందరిపై షాడో టీమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే వాతావరణం కల్పించాలన్నారు. ఏకగ్రీవాలు చేసుకోవాలని భావిస్తే.. శాంతియుత మార్గాల్లో.. ముందుకెళ్లాలని.. అలా కాదని దౌర్జన్యంగానో.. ప్రలోభాలకు గురిచేయాలనో అనుకుంటే ఎవరినీ ఉపేక్షించవద్దని ఆయన ఆదేశించారు. ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించే ఎలాంటి ప్రయత్నాలను ఉపేక్షించబోమని.. ఎవరినీ సహించేది ఉండదని ఆయన స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్

ఎన్నికలు సజావుగా జరగడం కోసం.. పారదర్శకంగా ఫిర్యాదుల నమోదు ప్రక్రియను కల్పించే ప్రయత్నం చేస్తున్నామని.. దీని కోసం టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎక్కడి నుంచైనా నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే… అలాంటి ఫిర్యాదును నమోదు చేసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అథెంటికేషన్ ఉండాలంటే యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ఉత్తమమన్నారు. ప్రజలు స్వేచ్ఛగా.. ప్రశాంతంగా ఎన్నికల్లొ పాల్గొని ఓటు హక్కు ఉపయోగించుకునే వాతావరణం కల్పిస్తామని.. ఈ మేరకు తగిన విధంగా కట్టుదిట్టమన ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.