తెలంగాణ ప్రభుత్వం 2018లో మొదటి సారి రాష్ట్ర వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత ‘కంటి వెలుగు’ను తాజాగా మళ్లీ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్మంచిదే అయినప్పటికీ.. డాక్టర్ల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యమా? తెలియదు కానీ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే18 మంది చూపు కోల్పోయారు. ఏ ప్రయత్నం చేసినా తిరిగి వారికి చూపు రాలేదు. బాధితులకు ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వలేదు. గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కండ్ల సమస్యలు పోయి కంటికి వెలుగొస్తుందనుకుంటే ఉన్న చూపు పోయి గుడ్డివారిగా మార్చిన విషాద ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల క్రితం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కంటి వెలుగు క్యాంపుల్లో టెస్టు చేసిన అధికారులు ఆపరేషన్ అవసరమైన వారికి 2018 సెప్టెంబర్ 26న హన్మకొండలోని జయ హాస్పిటల్లో సర్జరీలు చేశారు. ఆపరేషన్లు వికటించి18 మంది కంటిచూపు కోల్పోయారు. తర్వాత బాధితులను హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్‌కు తరలించారు. మరో రెండు, మూడు సర్జరీలు చేయించినా వారికి కంటిచూపు దక్కలేదు. ఆ 18 మందిలో ఇద్దరు చనిపోగా, మిగతా వారు కండ్లు కనిపించక, ఏ పని చేసుకోలేక నాలుగేండ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటనలో చూపు కోల్పోయిన వారికి ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఆ విషాద ఘటనకు డాక్టర్ల నిర్లక్ష్యం, ఆపరేషన్ థియేటర్లో వాతావరణం సరిగ్గా లేక ఇన్ఫెక్షన్ సోకిందని తేల్చిన అధికారులు హాస్పిటల్ నిర్వాహకులపైనా కనీస చర్యలు తీసుకోలేదు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు, ఆపరేషన్లు చేసిన జయ హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి ఘటనను మరుగున పడేశారని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నా, నేటికీ పట్టించుకునే వారే లేరు.
హడావిడి లేకుండా..
కోట్ల రూపాయలతో రాష్ట్రంలో19 ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆపరేషన్లు నిర్వహించేలా థియేటర్లను ఆధునీకరిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో12,748 క్యాంపులు, పట్టణ ప్రాంతాల్లో 3,788 క్యాంపులు పెట్టి,100 పనిదినాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నంది. గతంలో కంటి వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోవడంలో తప్పు లేదు. కానీ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు చూపు కోల్పోయే పరిస్థితి రావడం ఉండకూడదు. జాతీయ స్థాయిలో కంటి వెలుగు అమలు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కంటి వెలుగు విజయవంతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆపరేషన్అవసరం ఉన్న వారికి ప్రైవేటు హాస్పిటల్‌కు రెఫర్ చేసే ముందు అక్కడి పరిస్థితులను సమీక్షించాలి.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సోషల్ ఎనలిస్ట్