నకిరేకల్, వెలుగు : ఓడిపోయినా నిరుత్సాహపడకుండా గెలుపుకోసం ప్రయత్నించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. చిరుమర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై గెలిచిన వారికి ప్రైజ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా పాలసీని రూపొందించిందన్నారు. కేజీ టు పీజీ విద్య అందించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడేది లేదన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు పీఈటీలు కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, షిప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, డీఈవో భిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఫౌండేషన్ చైర్మన్ మనోజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం నకిరేకల్ మండలం నోముల హైస్కూల్‌లో మన ఊరు మన బడి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పాలెంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆమెకు స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు.