
- చింతమడక గ్రామస్తులతో కేసీఆర్
- 9 బస్సుల్లో ఫాంహౌస్‌కు వచ్చిన 540 మంది
ములుగు(మర్కుక్)/సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు బుధవారం ఆయన సొంత గ్రామమైన చింతమడక వాసులు వచ్చారు. 9 బస్సుల్లో 540 మంది గ్రామస్తులు తరలివచ్చారు. అయితే, వారు మధ్యాహ్నం ఒంటి గంటకు రాగా.. అపాయింట్మెంట్ లేకపోవడంతో సాయంత్రం నాలుగున్నర గంటల వరకు వారిని చెక్‌పోస్ట్ దగ్గరే ఆపేశారు.
చివరకు సాయంత్రం కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడంతో ఆయనను కలవడానికి గ్రామస్తులంతా ఫాంహౌస్‌లోకి వెళ్లారు. కొద్దిసేపటికి కిందికి వచ్చిన కేసీఆర్‌ను చూసిన గ్రామస్తులు ‘కేసీఆర్సీఎం.. కేసీఆర్సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ‘మేమంతా మీ వెంటే ఉంటాం’ అని గట్టిగా అరిచారు. కేసీఆర్వారికి అభివాదం చేస్తుండగా గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఒకరిని చూసి మరొకరు కంటతడి పెట్టుకోవడంతో.. కేసీఆర్‌తో పాటు అక్కడే ఉన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వారిని ఓదార్చారు. ‘‘మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం.. ఎవరూ అధైర్యపడొద్దు..” అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పదినిమిషాల పాటు వారితో ఉన్న కేసీఆర్.. ఆ తర్వాతలోపలికి వెళ్లిపోయారు. తర్వాత గ్రామస్తులంతా 6 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.
కేసీఆర్‌వైపే చింతమడక ఓటర్లు..
అసెంబ్లీ ఎన్నికల్లో చింతమడక ఓటర్లు కేసీఆర్‌వైపే నిలిచారు. పోలైన ఓట్లలో బీఆర్ఎస్కు 1,736 ఓట్లు రాగా, బీజేపీకి 23, బీఎస్పీకి 13, కాంగ్రెస్ పార్టీకి 11 ఓట్లు వచ్చాయి.