
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పిక్చర్ మారుతున్నట్టే కనిపిస్తోంది. రెవెన్యూ శాఖలోని అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని… కొత్త రెవెన్యూ చట్టాన్ని కఠినంగా రూపొందించి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో ఆశాఖలోని ఉద్యోగులు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు తహశీల్దార్ ఆఫీస్ ల ముందు కనిపిస్తున్న పోస్టర్లు, బ్యానర్లు .. ఆ శాఖలో కనిపిస్తున్న ఆందోళనను చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు.. ఇన్నాళ్లకైనా వారికి బాధ్యత తెలిసొచ్చిందనే అభిప్రాయాలు జనం నుంచి వినిపిస్తున్నాయి.
“ఈ ఆఫీస్ అవినీతి రహిత కార్యాలయం. ప్రజలు ఎవ్వరూ కూడా రెవెన్యూ సేవలకు డబ్బులివ్వొద్దు. మీయొక్క దరఖాస్తు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించబడుతుంది. VRA, VRO నుంచి సిబ్బంది వరకు ఎవరైనా డబ్బులు అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి. ఒక వేళ మా ఆఫీస్ లో ఎవరైనా అడిగితే కింద ఇచ్చిన నంబర్ కు ఫిర్యాదు చేయండి.
ముఖ్య గమనిక : రైతులు/ప్రజలు మధ్యవర్తులకు డబ్బులివ్వకండి. ఒకవేళ ఇస్తే మాకు సంబంధం లేదు. ఏ పనికైనా రైతులు సిబ్బంది, లేదా ఆఫీసర్లను నేరుగా కలవండి. ఎలాంటి డబ్బులు ఇవ్వకండి” అని అందులో విన్నపాలు చేస్తున్నారు.
షాద్ నగర్ తహశీల్దార్ కార్యాలయంలో తాజాగా కనిపించిన ఈ ప్రకటనపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ ఉద్యోగులేనా ఈ మాటలు చెప్పేది అని పబ్లిక్ అనుకుంటున్నారు.