మెట్ పల్లి, వెలుగు: నేషనల్హైవే–63 బైపాస్ కోసం చేపట్టిన భూసర్వేను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన రైతులు డిమాండ్చేశారు. బండలింగపూర్, వెల్లుల్ల, చౌలమద్ది, పెద్దాపూర్, అరపేట, మేడిపల్లికి చెందిన రైతులు మంగళవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. బైపాస్నిర్మాణం కోసం వ్యవసాయ భూములు లాక్కుంటే వందలాది రైతు కుటుంబాలు రోడ్డును పడతాయని వాపోయారు. ఏడాది పొడవునా మూడు పంటలు, కూరగాయలు పండించుకునే పొలాలను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్చేశారు. రూ.కోట్ల విలువ చేసే భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో దాదాపు 250 ఎకరాల్లో బైపాస్ నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీ ఆఫీసుల్లో నోటీసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు స్పందించి మెట్ పల్లి ప్రాంతంలో బైపాస్ భూ సర్వేను నిలిపివేయాలని కోరారు. బలవంతంగా భూములు లాక్కుంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.