ఓటేసిన వారికే ప్రోత్సాహకాలు అందించాలి: సీపీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు వేయని వారికి ఐదేండ్లపాటు సర్కారు స్కీములు ఇవ్వకుండా రూల్ తేవాల్సిన అవసరముందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఓటేయని వారికి ప్రశ్నించే హక్కుతోపాటు సర్కారు స్కీములు కోరే హక్కు కూడా లేదన్నారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గడంపై సీపీ సజ్జనార్ కామెంట్లు చేశారు. ఓటేయని స్టూడెంట్లు సీట్లు పొందకుండా రూల్ పెట్టాలని, జాబ్ అవకాశాల్లోనూ ఈ వ్యత్యాసం చూపించాలన్నారు. పోలింగ్ రోజు ముందు ఓటేయాలని.. తర్వాతే ఏ పనైనా చూసుకోవాలని చెప్పారు.
కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. కానీ ఇంత ఎక్కువ శాతం మంది ఓటు వేయకపోవడం సరికాదన్నారు. అందుకే సర్కారు ఓటు వేసిన వారిని ఒకలా, ఓటు వేయని వారిని మరోలా ట్రీట్ చేయాలన్నారు. ఓటేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేయాలని సూచించారు. ప్రజలు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలు వారి ఓటుతో ముడిపడి ఉంటాయని, పోలింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు దీనిపై స్టడీ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సీనియర్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు.