ఎములాడ హామీలపై వెనక్కి పోవద్దు

ఎములాడ హామీలపై వెనక్కి పోవద్దు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఇక్కడ వెలిసిన రాజన్న పేదల పాలిట కొంగు బంగారం. భక్తులు పిలిస్తే పలికే దైవం. ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా, ఈ ఆలయం అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు ఎములాడను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన కేసీఆర్ తాను అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏండ్లలో  చేసిన అభివృద్ధి కూడా నామమాత్రమే. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసి, దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నా ఆలయ అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడంతో  రాజన్న దేవాలయ అభివృద్ధిపై భక్తుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 

మాట తప్పినందుకే కేసీఆర్​ ఓడిండు

రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి మరవడం చూస్తుంటాం. కానీ, కేసీఆర్ దేవుడికి ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు. తన లగ్గం వేములవాడలోనే అయిందని చెప్పిన కేసీఆర్..  ప్రతి ఏటా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున నాలుగేండ్లు ఇస్తానని 2015 జూన్ 18న రాజన్నను దర్శించుకున్నప్పుడు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన రాజన్న ఆలయాన్ని ఎంతో డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు.  ఆలయానికి వచ్చే రోడ్లను విస్తరించాలని, ఆలయం చుట్టూ 1000 మీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలను పడగొట్టించాలన్నారు. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ(వీటీడీఏ) ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతి సూచనలతో ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తామని చెప్పారు. రాజన్న గుడి చెరువు కట్టను 150 ఫీట్ల వెడల్పుతో ట్యాంక్​బండ్​గా  డెవలప్ చేసి, చుట్టూ పార్కులు, చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మూలవాగుపై రెండు బ్రిడ్జిలతోపాటు నాంపల్లిగుట్టను కూడా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్​ఇచ్చిన మాట తప్పినందుకే ఓడిండని భక్తులు తెలిపారు.

హామీలు కాగితాలకే పరిమితం

గత ఎనిమిదేండ్లలో వేములవాడలో మూలవాగు మీద వంతెన తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రాజన్న గుడి చెరువు169 ఎకరాలు ఉండగా, మరో 35ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని సేకరించి, లెవల్ చేసి వదిలేశారు. 35 ఎకరాల్లో శివ కల్యాణ మండపం, రామ కల్యాణ మండపం, కల్యాణ కట్ట, వేద, నృత్య పాఠశాల, మధ్యలో చెరువు, అందులో నటరాజ్ విగ్రహం, పక్కన అన్నదాన భవనం, ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు కలగానే మిగిలి పోయాయి. అన్ని హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.  ఎములాడలో ప్రస్తుతం కొన్ని వసతి  భవనాలుకూలడానికి సిద్ధంగా ఉన్నాయి.

సీఎం రేవంత్ సమీక్ష

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్  రెడ్డి స్వామివారిని దర్శించుకున్నప్పుడు హామీ ఇచ్చారు.  రేవంత్​ సీఎం అయ్యాక రెండు నెలలలోపే వీటీడీఏ మీద సమీక్ష నిర్వహించారు. గతంలో రాజన్న ఆలయ అభివృద్ధికి హెచ్ఎండీఏ సాఫ్ట్ లోన్ ద్వారా 20 కోట్లు మంజూరైనా విడుదల కాలేదు. వీటిని రిలీజ్ చేయాలని సమీక్షలో ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఈ నిధులతో బద్ధిపోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన మండపం, గుడి చెరువు సుందరీకరణ, పార్క్ నిర్మాణం చేయాలన్నారు. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధితో పాటు పార్కింగ్‌ స్థలాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జితో పాటు బ్రిడ్జి నుంచి 800 మీటర్లు వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన రూ.35కోట్ల నిధులను త్వరలో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధితో పాటు పార్కింగ్‌ స్థలాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  కాగా, రాజన్న ఆలయం ఏ-1 గ్రేడ్ ఆలయం. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ నిధులను వాడినా ఆలయం అభివృద్ధి చెందుతుంది. రేవంత్ సర్కార్ ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలి.

Also Read : కరీంనగర్-వరంగల్​.. ఫోర్​ లేన్​ పనులు యమ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముందుకుసాగని బద్ధిపోచమ్మ ఆలయ విస్తరణ

రాజన్న ఆలయం అభివృద్ధి అటకెక్కడంతో అసెంబ్లీ ఎన్నికల ముందు బద్ధిపోచమ్మ ఆలయ విస్తరణ అంటూ హడావుడి చేశారు. 100 ఏండ్లకు తగ్గట్టు ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి ఆలయం చుట్టుపక్కల భూమిని సేకరించారు. అయితే భూసేకరణకు పైసా విడుదల చేయలేదు కేసీఆర్ సర్కార్.  నిబంధనలకు విరుద్ధంగా రాజన్న ఆలయం ఫిక్స్ డ్ డిపాజిట్లు గడువు తీరకముందే విత్ డ్రా చేసి బద్దిపోచమ్మ ఆలయ నిర్వాసితులకు నామమాత్రంగా పరిహారం చెల్లించారు. ఇండ్లు, దుకాణాలు కూలగొట్టి నిర్వాసితులను గెంటేసిన అప్పటి కేసీఆర్ సర్కార్... బద్ధిపోచమ్మ ఆలయం అభివృద్ధి పట్టించుకోలేదు.  బద్ధి పోచమ్మ ఆలయ నూతన భవనానికి డిజైన్ లేదు అన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు నిర్వాసితులకు ఆలయంలో ఉద్యోగాలు ఇస్తామని, ఆలయ భవనంలో దుకాణాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదు బీఆర్ఎస్ సర్కార్. 

-  కూర సంతోష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్