పౌరసత్వ బిల్లుపై అపోహలు వద్దు

పౌరసత్వ బిల్లుపై అపోహలు వద్దు

ప్రపంచంలో  సుమారు 197 దేశాలు ఉన్నాయి.  క్రైస్తవం, ఇస్లాం, హిందూ, బౌద్ధం, జైనం తదితర అనేక మతాలున్నాయి. చాలా యూరప్​ దేశాల్లో క్రైస్తవం అధికార మతంగా ఉంది. అనేక దేశాలు ‘ఇస్లామిక్​ రిపబ్లిక్స్’గా ఉన్నాయి. కొన్ని బౌద్ధ దేశాలు పాక్షికంగా మిగిలిపోయాయి. ఆ దేశాలు ఇస్లాం, కమ్యూనిస్టుల ధాటికి తట్టుకొని నిలబడ్డాయి. టిబెట్​ను ​మన కళ్లముందే కమ్యూనిస్టు చైనా ఆక్రమించింది. అలాగే మన సరిహద్దుల్లో ఉన్న నేపాల్​ ఏకైక హిందూ రాజ్యంగా ఉంటే అదీ కమ్యూనిస్టుల ప్రాబల్య దేశంగా మారింది. ఇక సెక్యూలర్​ స్టేట్​గా చెప్పే హిందువులు మెజార్టీగా ఉన్నది భారత్​లో​ మాత్రమే. వాస్తవానికి ఇక్కడ ‘హిందూత్వం’ ఉంది కాబట్టే సెక్యూలర్​ స్టేట్​గా ఉందని అనేకమంది పరిశోధకులు తమ గ్రంథాల్లో రాసుకొచ్చారు.

వందల ఏండ్ల బానిసత్వం తర్వాత భారతదేశం అనివార్యంగా విడిపోయింది. దేశ విభజన మతప్రాతిపదికన జరగడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం భయంకరంగా జరిగింది. మరీ ముఖ్యంగా స్వాతంత్ర్యం పొందామనే ఉత్సవం నిర్వహించుకోలేని హడావుడిలో దేశ విభజన అశాస్త్రీయంగా, ఆదరా బాదరాగా జరిగింది. ఈ క్రమంలో జనాభా మార్పిడి.. డా. అంబేద్కర్​ చెప్పినట్లు మత ప్రాతిపదికన జరిగితే బాగుండేది. అలాకాకుండా తమ నెత్తిన దేశవిభజన పిడుగు పడటంతో రాత్రికి రాత్రి బంగ్లాదేశ్, పాకిస్తాన్​లోని హిందువులు భారత్​లోకి వచ్చారు. కాగా, ఆనాడు పాకిస్తాన్​లోని హిందూ జనాభా 15శాతం ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్​లో 1.5శాతానికి పడిపోయింది. 

పక్కదేశాల్లో ఇతర మతస్థులపై దమననీతి

పాకిస్తాన్​, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ వంటి మన సరిహద్దు దేశాల్లో రాజకీయంగా జరిగే అవాంఛనీయ మార్పుల వల్ల అక్కడి ఇస్లామిక్​ చట్టాల అమలు వల్ల  ఇతర మతాలవారు అనేక హింసలకు గురవుతున్నారని అనేక ప్రపంచస్థాయి నివేదికలు తెలిపాయి. రఫిక్​జకారియా, తారీఖ్​ఫతే వంటి రచయితలు అక్కడ  హిందువులపై జరిగే దమననీతిని తమ పుస్తకాల్లో కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు. 2015లో వచ్చిన ఒక నివేదిక ఆధారంగా సంవత్సరానికి 1000 మంది యువతులు బలవంతంగా మత మార్పిడికి గురవుతున్నారు. బంగ్లాదేశ్​లో 22 శాతం ఉన్న హిందువులు 0.8 శాతానికి తగ్గిపోయారు. 1982లో 2.20 లక్షలున్న హిందూ, సిక్కులు ఇప్పుడు కేవలం 1,350 మంది మాత్రమే మిగిలారు అంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత జరుగుతున్నా రోజూ భారత్​ను ఆడిపోసుకునే ప్రపంచ మానవహక్కుల సంస్థలు ఒక్కసారి కూడా నోరు తెరవడం లేదు. 

సీఏఏతో దేశంలో రాజకీయాలు

పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్​లో ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేశాక దేశంలో అనేక రాజకీయాలు  మొదలయ్యాయి. మనదేశ మైనార్టీలకు ఏ సంబంధం లేకున్నా షాహిన్​బాగ్ పేరుతో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయా దేశాల్లో నివసించే హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మన దేశ పౌరసత్వం ఇచ్చే ప్రక్రియకు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం  తెరతీయడంతో ప్రస్తుతం రాజకీయ వేడి రగుల్కొంది. ఒవైసీ, మమతా బెనర్జీ నేరుగానే స్పందించారు.   పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్​ 31కి ముందు ఇక్కడికి వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది.   

ఇక్కడెందుకు ఉలికిపాటు..

మయన్మార్​ లాంటి చిన్న దేశం రోహింగ్యాల వల్ల తమకు కష్టంగా ఉందని అక్కడి చట్టసభల్లో తీర్మానం చేసి మరీ బయటకు పంపిస్తున్నారు. కానీ, రోహింగ్యాలు పశ్చిమబెంగాల్​ మొదలుకుని హైదరాబాద్​దాకా విస్తరించారు. ఇప్పుడు వాళ్ల పేరిట కాలనీలు ఏర్పాటయ్యాయి. వాళ్లపై సర్జికల్​ స్ర్టైక్​చేసి పంపిస్తాం అంటే పెద్ద దుమారం రేగింది.  కానీ, పాకిస్తాన్​, బంగ్లా, ఆఫ్గన్ ఇస్లామిక్ ​రిపబ్లిక్స్​లో పెద్ద ఎత్తున అత్యాచారానికి గురైన ఆరు మతాల వారికి భారత పౌరసత్వం ఇస్తాం అంటే ఆందోళన ఎందుకు అని విజ్ఞుల ప్రశ్న. 

తస్లీమా, అద్నాన్​ సమీలకు పౌరసత్వం 

 సాధారణంగా పౌరసత్వం కోసం అర్జీ పెట్టుకొనే విధానం మన రాజ్యాంగం కల్పించింది. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్, గాయకుడు అద్నాన్​ సమీలాంటివారు అలా అర్జీ పెట్టుకుని వచ్చినవారే.  రాజ్యాంగంలోని పౌరసత్వ బిల్లుకు సవరణ చేసి తెచ్చిన సీఏఏ మన విశాలపు హృదయాన్ని చాటుతోంది. ఒకప్పుడు భౌగోళికంగా మనకు అతి దగ్గరగా ఉన్న ఈ మూడు దేశాలకు చెందిన ఆరు మతాలవారికి పౌరసత్వం ఇవ్వడం మన ప్రజాస్వామిక విలువలకు దర్పణం పడుతోంది.  తూర్పుబెంగాల్​లోని హిందూ రక్షణను భారత్​ విస్మరించొద్దు. మానవత్వం, స్వలాభం మాత్రమే కాకుండా స్వాతంత్ర్యానికి, మేధోవికాసానికి తరాలుగా వారి త్యాగాలు, పడిన బాధలను దృష్టిలో ఉంచుకోవడం సముచితం అని జనసంఘ్​ సిద్ధాంతకర్త  డా. శ్యామప్రసాద్​ ముఖర్జీ ఏనాడో చెప్పారు. అదే ఈ రోజు మోదీ ప్రభుత్వం చేయడం యాదృచ్ఛికం  కాదు. చారిత్రాత్మకం. 

చట్టానికి మినహాయింపులు

కమ్యూనిస్టులు, లిబరల్స్​ ఈశాన్య రాష్ట్రాలపై తెగ ప్రేమ ఒలకబోస్తూ ఈ చట్టంవల్ల ఆయా రాష్ర్టాల అస్తిత్వం దెబ్బతింటుందని అపోహలు సృష్టిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్​లో పొందుపరిచిన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని  గిరిజన ప్రాంతాలను ఈ చట్టం నుంచి మినహాయించిన విషయం గ్రహిస్తే మేలు. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం జరుగుతుంటే భారత్​లో ర్యాలీలు, సెమినార్లు చేస్తున్నవారు పక్కనున్న భౌగోళిక,  సాంస్కృతిక  సరిహద్దులు, సంబంధాలు దేశంలోకి వస్తే నానాయాగీ చేయడం సబబు కాదు. భారతీయ మూలాల్లోని సెక్యులరిజం సోకాల్డ్​ నాయకులకు అర్థం కాకపోవడం వల్ల ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంది పుచ్చుకొంటుంది. 

అవి మార్కెట్​ దేశాలు 

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం ఆయా దేశాల రాజకీయాలకు చెదలు పట్టిస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రాచీన–ఆధునిక మేళవింపులతో భారత్​ సరికొత్త రూపంవైపు అనేక దేశాలు చూస్తున్నాయి. అమెరికా వంటి ఐరోపా దేశాల్లో పౌరసత్వం ఇచ్చే వెసులుబాటు బాగుంది. కానీ, వాళ్లు దేశాన్ని మార్కెట్​గా చూస్తారు. భారత సాంస్కృతిక విలువలకు పట్టంగట్టే క్రమంలో అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. మన సాంస్కృతిక  అస్తిత్వంపై పరాయివారి పెత్తనం లేకుండా అభివృద్ధిపథంలో నడపాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రపంచ మార్కెట్​లో మనం కూడా పోటీ ఇవ్వగలగాలి. ఈ క్రమంలో జరుగుతున్న ఓ ముందడుగులా కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని చూడాలి. ఈ చట్టం ఏ భారతీయుడి పౌరసత్వాన్ని లాక్కోదు.  మూడు దేశాల్లోని ఆరు మతాలకు చెందిన అణచివేతకు గురైన ప్రజలకు వేరే  గత్యంతరం లేదు. కాబట్టి వాళ్లకు పౌరసత్వం ఇచ్చి మతపరమైన అణచివేత నుంచి రక్షించాలన్నదే ఈ చట్టం ఉద్దేశం. 

అసలు సమస్య ఎక్కడ.. ఎందుకు?

బంగ్లాదేశ్, మయన్మార్​ వంటి దేశాల నుంచి వలస వచ్చిన రొహింగ్యాలు స్థానిక ప్రభుత్వాలను శాసించే పరిస్థితులు పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. భారతదేశంలో భారతీయులను వెతుక్కునే పరిస్థితులు వచ్చాయి. అస్సాంలోని  9 జిల్లాల్లో బంగ్లాదేశ్​ నుంచి చొరబాట్లు  ఎక్కువ జరిగాయి, జరుగుతుంటాయి. ధూబ్రీ 79.67శాతం, బార్పేట 70 నుంచి 74 శాతం. హాలాకాండీ 60.31శాతం, గోల్పోరా 57.52 శాతం, మోరీగావ్​ 52.56 శాతం చొరబాట్లు జరిగినట్లు తేలింది. దాంతో 2012లో  అస్సాం సమ్మిశ్రత మహాసంఘ్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఫలితంగా 26 మార్చి 1971 నుంచి 17 డిసెంబర్ 1996 వరకు అస్సాంలోకి వచ్చినవారిని గుర్తించి, ఎన్ఆర్సీ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1971 మార్చి 26న  బంగ్లాదేశ్ ​కొత్తదేశంగా ఏర్పడటం వల్ల ఈ తేదీ పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చినవారిని అక్రమ చొరబాటుదార్లుగా చూడాలని ఇందులోని సారాంశం.  ఎన్ఆర్సీ కోసం 31 డిసెంబర్​ 2017 నాటికి 3,29 కోట్లమంది అర్జీ పెట్టుకోగా  అందులో 1.90  కోట్లమందికి  మాత్రమే అర్హత  లభించిందంటే దేశంలోకి చొరబాట్లు ఎంత జరిగాయో ఊహించుకోవచ్చు. దాని క్రమంలో వచ్చిందే ఈ పౌరసత్వ సవరణ చట్టం. 

- డా. పి. భాస్కరయోగి, సోషల్​ ఎనలిస్ట్​