- పాత హామీలు అమలు చేయకుండా మళ్లీ అవే ప్రకటించిండు: కిషన్‌రెడ్డి
- మునుగోడులో రోడ్డు లేని ఊరిలోనూ 30 బెల్టుషాపులా?
హైదరాబాద్, యాదాద్రి, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్ ఓటమిని సీఎం కేసీఆర్ ముందే అంగీకరించాడని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చండూరు సభలో కేసీఆర్ పాత హామీలే మళ్లీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. కేసీఆర్ కుటుంబ మోసాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. 8 ఏండ్లలో మునుగోడులో అమలు చేయని హామీలు.. 15 రోజుల్లో చేస్తా అంటాడని విమర్శించారు. జిమ్మిక్కులు, అవినీతి చేయడం, అబద్ధాలతో కాలం వెళ్లదీయడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు.
ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
చండూరు సభలో నిలబెట్టిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని ఆరోపించారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ‘‘సీపీఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అలాంటిది ఈరోజు టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ఇస్తున్నది. లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్‌కు ఎలా మద్దతు ఇస్తున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలి” అని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌లో ఎందుకు బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. ‘‘మీ ఎమ్మెల్యేలు మాకెందుకు? వారికి వందకోట్లు పెట్టేంత నీతిమంతులా? ఎవరు కొనేందుకు వచ్చారు? ఎంత డబ్బు తెచ్చారో తేల్చేందుకు కోర్టులకు ఎందుకు చెప్పటం లేదు? రూ.400 కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నరని అంటున్నవ్. ఈ అంశాన్ని ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు. ఢిల్లీ బ్రోకర్లు అంటున్నావు.. నీవు కూడా బ్రోకరిజం నేర్చుకున్నావా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన తమకు లేదని.. ముందుగా రద్దు చేసుకుని సానుభూతి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు.
నీళ్లు ఇన్నాళ్లు ఎందుకియ్యలే
‘‘దున్నపోతుకు గడ్డి వేస్తే... ఆవు పాలు ఇవ్వదని కేసీఆర్ నిజం చెప్పాడు. ప్రజలకు కావాల్సింది చిన్న చిన్న అవసరాలే. ఊళ్లకు బస్సులు, స్కూల్, రోడ్లు, ఉద్యోగాలు ఇవే అడుగుతారు” అని కిషన్ రెడ్డి తెలిపారు. ఫ్లోరైడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాని కన్నా ఎక్కువే కేంద్రం ఖర్చు చేసిందని, రూ.800 కోట్లను ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఖర్చుచేసిందని తెలిపారు. మునుగోడు నీళ్లు ఇస్తానని ఇప్పుడు అంటున్నారని, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మునుగోడు మండలంలో ఆర్టీసీ బస్సు రాని, రోడ్డు లేని ఊరిలో 30 బెల్టుషాపులు ఉన్నాయన్నారు. ‘‘నువ్వు ప్రధాని అయితే దేశం మొత్తం బెల్ట్ షాపులు పెడుతావా కేసీఆర్” అని ఎద్దేవా చేశారు.
చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా ఎందుకు?
జీఎస్టీని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కాదని, జీఎస్టీ కౌన్సిల్ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జీఎస్టీ వద్దనుకుంటే కౌన్సిల్ మీటింగ్‌లో ఎందుకు అడగలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘‘చేనేతలో రూ.40 లక్షల టర్నోవర్ ఉంటేనే జీఎస్టీ ఉంటుంది. ఈ జీఎస్టీలో 2.5 శాతం స్టేట్ గవర్నమెంట్‌కు వస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వదులుకోవటం లేదు” అని నిలదీశారు. దేశంలో పెట్రోల్‌పై అత్యధిక ట్యాక్స్ వేసి.. అత్యధిక రేటుకు అమ్మేది తెలంగాణలోనే అని అన్నారు.
అక్రమాస్తులను కాపాడుకునేందుకే సీబీఐ రాకుండా జీవో
అక్రమాస్తులను కాపాడుకోవడానికే తెలంగాణలో సీబీఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ జీవో తెచ్చారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన మాఫియా రూ. వేల కోట్లు సంపాదించుకున్నారు. భూములు, ఫామ్‌హౌస్‌లు కొనుగోళ్లు చేశారు. ఈ అక్రమాస్తులపై న్యాయస్థానం ఎక్కడ సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందోనన్న భయంతోనే తెలంగాణలో సీబీఐ అడుగుపెట్టకుండా అనైతిక జీవో తెచ్చారు” అని మండిపడ్డారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. 100 కోట్లు పట్టుబడ్డాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా చెబుతున్నారని, మరి ఆ డబ్బు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆ డబ్బంతా లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఆప్ మధ్య చేతులు మారాయోమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీతో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్న మాట నిజమేనని, వారెంత మంది ఉన్నరో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు.