
శ్రీనగర్: ఆర్టికల్ 35(ఏ) విషయంలో భారత ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు పీడీపీ చీఫ్, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే ఆర్టికల్ 35(ఏ)ని టచ్ చేస్తే ఎవరూ ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 1947 నుంచి ఎప్పుడూ చూడని పరిస్థితులను చూస్తారని ముఫ్తీ అన్నారు. 35(ఏ)ని మార్చడం గానీ తొలగించడం గానీ చేస్తే కశ్మీర్ ప్రజలు భారత జెండాని వదిలేస్తారని చెప్పారు. దాని స్థానంలో ఏ జెండాను పట్టుకుంటారో చెప్పలేనని అన్నారామె.
ఆర్టికల్ 35-ఏ అంటే..
కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్సిస్తూ ఆర్టికల్ 35-ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు.ఈ ఆర్టికల్ ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు వచ్చాయి. ఇక్కడి పౌరులను శాశ్వత నివాసులుగా గుర్తిస్తూనే.. బయటి వ్యక్తుల రాకను ఈ ఆర్టికల్ అడ్డుకుంటోంది. ఆర్టికల్ 35-ఏ ప్రకారం ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్ లో ఆస్తులు కొనకూడదు, స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు, పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు. ఇక ఇక్కడి మహిళ వేరే రాష్ట్ర వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు సంక్రమించదు. దీన్ని తొలగించాలని ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీవో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై రివ్యూకు సుప్రీం సిద్ధమైన నేపథ్యంలో మొహబూబా ముఫ్తీ పై వ్యాఖ్యలు చేశారు.