యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వొద్దు: సీఎస్ శాంతికుమారి

యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వొద్దు: సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు: యాసంగి సాగుకు నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఇరిగేషన్ శాఖ కసరత్తులు చేస్తున్నది. చివరి ఆయకట్టుకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీళ్లివ్వనున్నారు. ఏప్రిల్ వరకు ఆన్​అండ్ ఆఫ్ పద్ధతిలో వివిధ ప్రాజెక్టుల కింద 33.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో యాసంగి పంటలకు నీరు, కరెంట్ సరఫరాపై అధికారులతో సీఎస్ శాంతి కుమారి రివ్యూ చేశారు. కలెక్టర్లతో వర్చువల్‎గా మాట్లాడారు. 

పంటలకు సాగు నీరు, విద్యుత్ సరఫరా, తాగునీరు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సూచనలు చేశారు. యాసంగి లక్ష్యానికి అనుగుణంగా పంటలకు నీళ్లివ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. డిస్ట్రిబ్యూటరీల గేట్లను అనధికారికంగా ఎత్తకుండా పోలీస్, స్థానిక ఈఈలు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్​ అందుబాటులో ఉందని.. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలకు వేసవిలో డిమాండ్​కు అనుగుణంగా అంతరాయం ఉండకుండా సప్లై చేయాలని సూచించారు.