అసమర్థ అధికారులను వెనకేసుకు రావొద్దు : జీహెచ్ఎంసీ లాయర్​పై హైకోర్టు ఫైర్

అసమర్థ అధికారులను వెనకేసుకు రావొద్దు : జీహెచ్ఎంసీ లాయర్​పై హైకోర్టు ఫైర్
  • చెరువుల పరిరక్షణపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ఆగ్రహం
  • నిర్లక్ష్యంగా ఉండే అధికారులకు షాక్ ట్రీట్​మెంట్ ఇస్తే గానీ కదలిక రాదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రామంతాపూర్ పెద్ద చెరువుతో పాటు ఇతర చెరువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు అనుగుణంగా నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. గత నెల 13న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఈ నెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. 25 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్ద చెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారంటూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కేఎల్ వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ లాయర్ వాదిస్తూ.. 3,533 చెరువులు ఉన్నాయని, వాటి రక్షణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. మూడు శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉందని చెప్పారు.

వారం రోజులు గడువు ఇస్తే నివేదిక సమర్పిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో హైకోర్టు కల్పించుకుని.. ‘‘మూడు శాఖలైనా 30 శాఖలైనా ఒక్కటే. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందే. అసమర్థ అధికారులను వెనకేసుకురావొద్దు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు గౌరవాన్ని కాపాడాలని సూచించింది. నీటి వనరుల పరిరక్షణ ఒక్కరి కోసం కాదని, భవిష్యత్తు కోసమని.. అలాంటప్పుడు పని చేయని అధికారులను సమర్థించవద్దని చెప్పింది. గతంలో చెరువు రక్షణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరితే... అది చేయకపోగా, సంతకం లేని కాగితాన్ని పంపారని పేర్కొంది. అలాంటి అధికారులకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తే గానీ కదలిక రాదని వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.