అవినీతి అంతం చేేసే సత్తా మన పాలకులకు లేదా ?

పేదల అభ్యున్నతికి, దేశ, రాష్ట్ర పురోగతి కోసం లక్షల కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అవినీతి కారణంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రభుత్వ స్కీమ్స్ అట్టడుగు వర్గాల వరకూ చేరడం లేదు. డెవలప్ మెంట్ వర్క్స్ లో క్వాలిటీ ఉండట్లేదు. అవినీతి భరతం పడతామ‌‌ని, ఉక్కు పాదాలతో అణిచివేస్తామని పాలకులు చెబుతున్నా మాటలు తప్ప.. చేతల్లో కనిపించడం లేదు.

ఎన్నో ఏళ్లుగా కరప్షన్ కంట్రోల్ అన్న నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. దానికి తగ్గ ఫలితాలు రాకపోవడానికి… కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు ఉన్న కొంత మంది స్వార్థపరుల అవినీతి వేళ్లూనుకుపోవడం ఒక కారణమైతే.. ప్రభుత్వాలను నడిపించే రాజకీయ పార్టీలకు గట్టి సంకల్పం, నైతిక విలువలు  లేకపోవడం మరో కారణం. అయితే ఎన్నో ఏళ్ల పోరాటం, బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఆ తరహా పరిస్థితులు ఉండబోవని ప్రజలంతా ఆశించారు. దశాబ్దాల అణచివేతను ఎదిరించి.. కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ కసితో మంచి చేస్తుందని, అవినీతి అన్నదానికి తావు లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు అందుతాయని అంతా అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చిన కొన్నాళ్లకే అసలు రంగు బయటపడింది. స్వార్థ రాజకీయాలతో అవినీతికి పాల్పడుతూ ప్రజల ఆశలపై ఆ పార్టీ నేతలు నీళ్లు చల్లారు. నాయకులు అలా ఉంటే ఉద్యోగులు కూడా లంచాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతూ మేం ఏం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎటువంటి అక్రమాలకూ చాన్స్ ఇవ్వకుండా మన నిధులు, నియామకాలు, నీళ్లు మనకే న్యాయంగా చెందుతాయని రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో చూశారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నే గెలిపించి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చాక మొదట్లో కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఉద్యమ ఆశయాలు మాత్రం నెరవేరలేదు. ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా మారింది. నిరుద్యోగ సమస్య నేటికీ అట్లనే ఉంది. ప్రతి ఇంటికీ మంచి నీరు, కోటి ఎకరాలకు సాగు నీరు అని చెప్పి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వంటివి ప్రారంభించారు. భారీ ప్రాజెక్టుల పేరుతో వేల, లక్షల కోట్లు నిధులు ఖర్చు చూపించి, అడ్డంగా పాలక పక్షం అవినీతికి పాల్పడింది. కేసీఆర్ ఫ్యామిలీ సహా పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధుల్లోనూ వేల కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించి, ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో రాజకీయ నేతలు మింగేస్తున్నారు.

అధికారులదీ అదే తీరు

తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతి తగ్గుతుందని ప్రజలు ఆశించారు. రాజకీయ నాయకుల సంగతి అటుంచితే.. ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల చేతివాటం తగ్గుతుందని అనుకున్నారు. నిజానికి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరిగాయి. అయినప్పటికీ దొడ్డిదారుల్లో వచ్చే ఆదాయం కోసం వారిలో వెంపర్లాట మాత్రం తగ్గలేదు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది ఇంకా ఎక్కువైందని, ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల రికార్డులు చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాలు పాలనా వికేంద్రీకరణ కోసం కాకుండా అవినీతి కోసం అన్నట్టుగా ఆఫీసుల్లో పరిస్థితి కనిపిస్తోంది. కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రజల బాగోగులను పట్టించుకోవడం మానేసి రాజకీయ నాయకుల పంచన చేరి కమీషన్లు తీసుకుంటూ వారికి కావాల్సిన పనుల్లో బిజీగా ఉంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం మాట గాలికొదిలేశారు. పెద్ద మొత్తాల్లో లంచాలు ఇచ్చుకోగలిగిన వాళ్ల పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఏదైనా ఊరి సమస్య అనో, లేదా సంక్షేమ పథకాల లబ్ధి కోసమనో వచ్చే పేదలను మాత్రం చాలా ఆఫీసుల్లో పట్టించుకునేవారే లేరు. దీని వల్ల ప్రభుత్వాధికారులు అందరిపైనా ప్రజల్లో తప్పుడు భావన కలుగుతోంది. ఈ పరిస్థితి వల్ల నిజాయితీగా పని చేసే ఉద్యోగులు, అధికారుల నైతికత దెబ్బతింటోంది.

లీడర్లు, ఆఫీసర్ల వాటాలు

రాష్ట్రంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆబ్కారీ, మున్సిపాలిటీ, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్లలో అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యా శాఖ, వైద్య శాఖల్లోనూ నడిచే కరప్షన్ దందా వేరే లెవెల్.

ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో పనులు కేటాయింపులకు అధికారులు 10 నుంచి 15 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలకు వాళ్లవాళ్ల స్థాయిని బట్టి వాటాలు అందుతూనే ఉన్నాయి. కొద్ది మంది ఎమ్మెల్యేలే అవినీతి విషయంలో భయపడుతున్నారు. కానీ చాలా మంది టీఆర్ఎస్ నేతలు గుట్టుచప్పుడు కాకుండా కమీషన్లు తీసుకుంటూ పని నడిపిస్తున్నారు. పోస్టింగ్ ల విషయంలోనూ పైరవీలు చేసి తమ తమ నియోజకవర్గాల్లో వారికి కావాల్సిన అధికారులను వేయించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత నడిచే దందా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఏసీబీకి దొరికిపోతున్న అవినీతి అధికారులు

రాజకీయ నేతల అవినీతి బయటపడి ప్రజలకు దొరకడం కష్టమేమో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలు మాత్రం ఈజీగా ఏసీబీ బట్టబయలు చేస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గంలో ఇటీవల ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో ఇంట్లో రూ.90 లక్షలు దొరికాయంటేనే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ నెలలో షేక్ పేటలో ఓ ఎమ్మార్వో ఇంటిపై జరిగిన ఏసీబీ రైడ్ లో అధికారులు రూ.30 లక్షలు సీజ్ చేశారు. ఓ భూవివాదంలో కబ్జాదారులకు సహకరించేందుకు ఆ సొమ్ము లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. బంజారాహిల్స్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తులకు సహకరించేందుకు మరో ఎమ్మార్వో రూ.15 లక్షల లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్సైని కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇలా అనేక కేసుల్లో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడుతూ అధికారులు దొరుకుతున్నా.. వారికి ఎక్కడా కఠిన శిక్షలు పడిన దాఖలాలులేవు. దీంతో అవినీతి అధికారులకు భయం లేకుండా పోతోంది.

అనుకుంటే సాధ్యమే

రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది అన్న మాటను నేటి పాలకులు గుర్తుంచుకోవాలి. దీనిని సరైన మార్గంలో ప్రజలకు మంచి చేయడం కోసం వాడాలి. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సక్రమంగా అందించేందుకు     దొరికిన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పాలకులు అనుకుంటే అవినీతిని రూపుమాపడం పెద్ద కష్టమేం కాదు. అయితే దీనికి కావాల్సిందల్లా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నైతిక విలువలు, శక్తి ఉన్న రాజకీయ నాయకత్వం మాత్రమే.-మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ.