
ఓయూ, వెలుగు: వన్ నేషన్, వన్ ఎలక్షన్ లా ఒకే జీఎస్టీ, ఒకే ఆధార్ కార్డుతో దేశమంతా ఒక్కటి కావాలని ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో విజన్–- 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవాన్ని అధ్యక్షుడు హరి చరణ్, జనరల్ సెక్రటరీ పుట్ట పాండు రంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
దీనికి చీఫ్గెస్ట్ గా విద్యా సాగర్ రావు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం మీదనే ఆధారపడాలని అందరు చూడొద్దని కోరారు. ఎన్జీవోల సహాయంతో ముందుకు వెళ్లేలా ఆలోచన చేయాలని చెప్పారు. పదేండ్లుగా రూ.30 లక్షల కోట్ల డబ్బు మధ్యవర్తులు లేకుండా పేద ప్రజల అకౌంట్లలోకి నేరుగా వెళ్లి పడిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టికి అది నిదర్శనమని వివరించారు.
డిజిటల్ రంగంలో ఇండియా ఎంతో పురోగతి సాధించిందని వెల్లడించారు. మధ్యతరగతి ప్రజల ఇన్ కమ్ ట్యాక్స్ ను రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్, కర్నాటక సెంట్రల్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.