చైనాను శత్రువుగా చూడొద్దు.. భారత్​ తన వైఖరి మార్చుకోవాలన్న కాంగ్రెస్​ నేత శామ్​ పిట్రోడా

చైనాను శత్రువుగా చూడొద్దు.. భారత్​ తన వైఖరి మార్చుకోవాలన్న కాంగ్రెస్​ నేత శామ్​ పిట్రోడా

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఆ పార్టీ ఓవర్సీస్​చీఫ్​ శామ్ ​పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. చైనా విషయంలో భారత్​ తన వైఖరి మార్చుకోవాలంటూ ఆయన కామెంట్ చేశారు. వీటిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టగా.. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని కాంగ్రెస్​ వివరణ ఇచ్చుకుంది. 

ఓ టీవీ ఇంటర్వ్యూలో శామ్​ పిట్రోడా మాట్లాడుతూ.. ‘‘పొరుగు దేశమైన చైనాను శత్రువుగా చూడొద్దు. ఆ దేశంతో వచ్చే ముప్పు ఏమిటో అర్థంకావడం లేదు. మనం మొదటి నుంచీ ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నాం. ఇప్పటికైనా చైనా విషయంలో మన మైండ్​ సెట్​ మారాలి” అని అన్నారు. చైనాను అమెరికా శత్రువుగా భావిస్తున్నదని, అదే విధానాన్ని భారత్​ కూడా ఫాలో అవుతున్నట్లుందని అన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భేటీ సందర్భంగా.. చైనా విషయంలో భారత్​కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని భారత్​ సున్నితంగా తిరస్కరించింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత శామ్​పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతదేశ ఐడెంటిటీని, దౌత్యవిధానాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఆయన కామెంట్లు ఉన్నాయని బీజేపీ మండిపడింది. ‘‘పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్​ మైండ్​సెట్​ను తెలియజేస్తున్నాయి. గతంలో రాహుల్​గాంధీ కూడా చైనా విషయంలో ఇలాంటి కామెంట్లే చేశారు” అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తప్పుబట్టారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్​ ప్రకటించింది. 

‘‘శామ్​ పిట్రోడా కామెంట్లు కాంగ్రెస్​ పార్టీ అభిప్రాయాలు కావు. చైనా నుంచి ఇప్పటికీ మన దేశానికి విదేశాంగ వ్యవహారాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాల్లో పెను సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి” అని కాంగ్రెస్​ పార్టీ కమ్యూనికేషన్స్​ 
ఇన్​చార్జ్​ జైరాం రమేశ్​ ట్వీట్​ చేశారు.