IND vs AUS: కోహ్లీని గెలకొద్దు.. అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదు: గ్లెన్ మెక్‌గ్రాత్

IND vs AUS: కోహ్లీని గెలకొద్దు.. అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదు: గ్లెన్ మెక్‌గ్రాత్

స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఓటమి అనంతరం భారత జట్టు మరో సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియన్లను వారి సొంత గడ్డపైనే ఢీకొట్టనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం(నవంబర్ 22) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కంగారూల జట్టుకు ఆ దేశ దిగ్గజ ప్లేయర్ గ్లెన్ మెక్‌గ్రాత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయొద్దని ఆ జట్టు ఆటగాళ్లకు సూచించారు. 

ఫామ్‌లో లేని కోహ్లీ

కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేరన్న విషయం వాస్తవమైనప్పటికీ, అతన్ని గెలికితే ఏం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. విరాట్ సాధారణ మ్యాచుల్లోనే చాలా సీరియస్‌గా, ఫుల్ డెడికేషన్‌తో బ్యాటింగ్ చేస్తుంటాడు. అలాంటిది బిగ్ టీమ్స్‌తో మ్యాచ్‌ అంటే చెలరేగిపోతాడు. పట్టుదలతో ఆడుతూ జట్టును విజయతీరాలకు చేరుస్తాడు. అందునా, రోహిత్ శర్మ గైర్హాజరీలో బ్యాటింగ్‌ విభాగాన్ని నడిపించాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. ఈ భయమే ఆసీస్ దిగ్గజాన్ని వెంటాడింది. అందువల్ల, ఆసీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ విలువైన సూచనలు చేశారు. 

స్లెడ్జింగ్‌ చేయడం వల్ల లాభం లేదు

కోహ్లీ దగ్గర స్లెడ్జింగ్ వంటి అత్యుత్సాహ ఘటనలు పనిచేయవన్న మెక్‌గ్రాత్.. అతన్ని రెచ్చగొట్టడం వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదని చెప్పుకొచ్చారు. అతని మానాన ఆతని వదిలేస్తే, ఆతిథ్య జట్టుకు ఎంతో మేలు చేసినవారు అవుతారని అన్నారు.

"న్యూజిలాండ్‌ చేతిలో సిరీస్ కోల్పోయాక భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆ జట్టు స్టార్లు ఎవరూ పెద్దగా ఫామ్‌లో లేరు. కోహ్లీపైనా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఆసీస్‌ బౌలర్లు అతన్ని లక్ష్యంగా చేసుకుంటారనడంలో సందేహం లేదు. అయితే, దాని వల్ల జట్టుకు ఎటువంటి ఉపయోగం లేదు. అతను తిరిగి ఫామ్ లోకి రావచ్చు కూడానూ. అదే జరిగితే, ఆసీస్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఒత్తిడిలో ఉన్న అతన్ని అలానే వదిలేయడం ఉత్తమం. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అలాంటివి చేయడనే అనుకుంటున్నా. ఒకవేళ చేసినా సంతోషమే. ఆ వార్ చూడటానికి బాగుంటుంది.." అని మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా గడ్డపై మంచి రికార్డు

కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై మంచి రికార్డు ఉంది. 13 టెస్టుల్లో ఆరు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో 1,352 పరుగులు చేశాడు. సగటు 54కు పైగా  ఉంది.