లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

  • వచ్చే పదేండ్లు నేనే సీఎం గా ఉంటా -కేసీఆర్
  • ఇంకోసారి ఆయన సీఎం.. ఈయన సీఎం అంటే తోలు తీస్త.. పార్టీ నుంచి పీకేస్త: కేసీఆర్​
  • భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లోకి పోత.. ఏం చేయాల్నో అప్పుడు ఆలోచిద్దాం
  • సీఎం మార్పిడి ప్రచారంపై టీఆర్​ఎస్​ లీడర్లకు స్ట్రాంగ్​ వార్నింగ్​
  • పార్టీ నడుపుడంటే పాన్​ షాప్​ నడిపినంత, పాటలు పాడినంత ఈజీ కాదు.

హైదరాబాద్, వెలుగు: సీఎం మార్పుపై ఇష్టమున్నట్లు మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్తానని, అయినా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాళ్లను పట్టుకొని బండకేసి కొడుతానని టీఆర్​ఎస్​ లీడర్లకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్​ స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చారు. తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని అడుగుతున్నారా? అని నిలదీశారు. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని తేల్చి చెప్పారు. తాను ఆరోగ్యంగా, దుక్కలాగా ఉన్నానన్నారు. వచ్చిన తెలంగాణ ఆగం కావొద్దనే సీఎం అయ్యానని, సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పారు. ‘‘నేను అధికారంలో ఉండగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతరా? ఇంకోసారి ఆయన సీఎం.. ఈయన సీఎం అంటే తోలు తీస్త, వినకపోతే పార్టీ నుంచి పీకేస్త” అని హెచ్చరించారు. కొన్ని రోజులుగా ‘కేటీఆర్​ సీఎం’ అంటూ టీఆర్​ఎస్​లో జోరుగా ప్రచారం జరుగుతుండటం, దీనిపై లీడర్లు బహిరంగంగానే మాట్లాడుతుండటంపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్​ ఫైర్​ అయ్యారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏం చేయాలో, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, అసెంబ్లీని రద్దు చేసినప్పుడు ఎమ్మెల్యేలకు ఏమైనా చెప్పానా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని, అప్పుడు ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామన్నారు.

అనవసరంగా మాట్లాడితే చర్యలు తప్పవని లీడర్లకు స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ మీటింగ్ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు దాదాపు 600 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మార్పుపై లీడర్లు చేస్తున్న ప్రకటనలను ప్రత్యేకంగా ప్రస్తావించి కేసీఆర్ క్లాస్ పీకారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సుమారు గంటన్నర పాటు మాట్లాడిన కేసీఆర్.. పార్టీ ప్రస్తానం, పార్టీ బలోపేతం, పార్టీలో క్రమశిక్షణపై ఫోకస్ చేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మీటింగ్​ వివరాలు ఇవీ..

పార్టీ లైన్​ దాటొద్దు

తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని కేసీఆర్  చెప్పారు. ‘‘గతంలో అసెంబ్లీ వేదికగా సీఎంగా నేనే ఉంటా అని చెప్పిన కదా.. నేను దుక్కలా ఉన్న. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయినా మీరు ఎందుకు సీఎం మార్పుపై మాట్లాడుతుండ్రు?  ప్రతి దానికీ పార్టీ లైన్ ఉంటది. ఆ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దు. అయినా మాట్లాడుతాం అంటే పార్టీ నుంచి బయటికి పంపుతా’’ అని హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏం చేయాలో, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘‘అసెంబ్లీ రద్దు చేస్తున్పప్పుడు మీకు ముందు చెప్పానా? అప్పట్లో ప్రగతిభవన్ కు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎమ్మెల్యేలు. నిర్ణయం తీసుకున్నాక మీరు మాజీ ఎమ్మెల్యేలు అయిండ్రు. అప్పట్లో సాయంత్రం అభ్యర్థులను ప్రకటించగానే మీరు అభ్యర్థులు అయ్యారు’’ అని గుర్తు చేశారు. ‘‘భవిష్యత్ లో నేను కేంద్ర రాజకీయాలకు వెళ్తే… అప్పుడేం చేయాలో, మీ అందర్ని అడిగి నిర్ణయం తీసుకుంటా. మనం అందరం కుటుంబ సభ్యులం. మిమ్మల్ని కాదని నేను ఏ నిర్ణయం తీసుకోను’’ అని చెప్పారు.

మరికొన్ని అద్భుత పథకాలు రెడీ

భవిష్యత్ లో మరో రెండు మూడు అద్భుత పథకాలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని చెప్పారు. ఎస్టీ, ఎస్టీల అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ నిధులు కాకుండా అదనంగా మరో రూ. 10 వేల కోట్లు  కేటాయిస్తానన్నారు. ప్రతి నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఓ బుక్ లెట్ తయారు చేసి, అందరికీ ఇస్తామని వెల్లడించారు.

సీల్డ్​ కవర్​లో మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ల పేర్లు

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడేట్లు ఎవరనేది ఇప్పుడు చెప్పలేమని కేసీఆర్​ అన్నారు. ఈ నెల 11న ఉదయం గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు అందరూ తెలంగాణ భవన్ కు రావాలని, వారి చేతికి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లతో ఉన్న  సీల్డ్​ కవర్ ఇస్తామని, దాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేయాలని వివరించారు.

నాగార్జునసాగర్ లో గెలుస్తం

నాగార్జునసాగర్  ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. అలాగే త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని లీడర్లను ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్  విజయం సాధిస్తుందన్నారు.

6 లక్షల మందితో పార్టీ ఆవిర్భావ సభ

పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్​ 27న 6 లక్షల మందితో భారీ బహిరంగ నిర్వహిస్తామని కేసీఆర్  ప్రకటించారు. ‘‘ఏ జిల్లా లీడర్లు ముందుకు వస్తే అక్కడే మీటింగ్ పెడుదాం. సమావేశాన్ని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం’’ అని అన్నారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం మొదలవుతుందని, ప్రతి ఎమ్మెల్యే 50 వేల మందితో సభ్యత్వాలు చేయించాలని, ఈ నెల చివరి నాటికి పూర్తి కావాలని చెప్పారు. ఇంట్లో కూర్చొని పేర్లు రాస్తే కుదరదన్నారు.

త్వరలో జిల్లాల్లో పర్యటిస్త

త్వరలో తాను జిల్లాల్లో పర్యటిస్తానని, ఈ సందర్భంగా పోడు వివాదం పరిష్కారం కోసం  కృషి చేస్తానని కేసీఆర్​ చెప్పారు. జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్మన్లతో జిల్లాల వారీగా భేటీ అయ్యారు. జిల్లాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను పర్యటనకు వచ్చినప్పుడు వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తీరు మార్చుకోకపోతే టికెట్ కట్

ఎమ్మెల్యేలను కాదని ఏ నిర్ణయం తీసుకోబోమని కేసీఆర్ చెప్పారు. వారు చెప్పినట్టుగానే పనులు, పోస్టులు ఇస్తున్నామని అన్నారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని, పార్టీలోని మిగతా లీడర్లను పక్కన పెడ్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోతే టికెట్ కట్ చేస్తామని హెచ్చరించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై లోకల్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ చేస్తామన్నారు. భవిష్యత్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా కోటా కేటాయిస్తా మన్నారు. జిల్లాల్లో వర్గపోరు లేకుండా చేసేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ చొరవ తీసుకోవాలని సూచించారు.‘‘ఇగనుంచి జడ్పీ చైర్మన్ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను లంచ్ కు పిలవాలి. ఆ లంచ్ కు అందరూ పోవాలి. అక్కడ అందరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి. అప్పుడు విభేదాలు రావు’’ అని చెప్పారు.

సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం

సీఎం పదవి తనకు ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం తెచ్చినందుకు ప్రతి ఇంట్లో మహాత్మాగాంధీతో సమానంగా తన ఫొటో ఉండేదని, తెలంగాణ పునఃనిర్మాణం కోసం పదవి చేపట్టాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను లేకపోతే రాష్ట్రం ఆగం అవుతదని సీఎం పదవి తీసుకున్న. తెలంగాణ పునఃనిర్మాణం కోసం కష్ట పడ్తున్న. కానీ ఇప్పుడు అయినోనితోని, కానోనితోని మాటలు పడ్తున్న’’ అని అన్నారు.

పార్టీని నడుపుడంటే పాన్​షాప్​ నడిపినట్లు కాదు

కొన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయాలను బయటికి చెప్పలేనని కేసీఆర్ అన్నారు. ‘‘పార్టీని నడపడం అంటే పాన్ షాప్ నడిపినట్టు, పాటలు పాడినంత ఈజీ కాదు. చాలా కష్టం. 20 ఏండ్లుగా పార్టీని నడుపుతున్న. ఎన్నో కష్టాలు పడ్డ. మీరు పదవులు రాగానే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నరు’’అని క్లాస్​ తీసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై స్ట్రాంగ్  కౌంటర్లు ఇవ్వాలన్నారు.

ఇవి కూడా చదవండి..

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్

వైరల్ వీడియో: మహిళా జడ్జితో నిందితుడి పరాచకాలు