
హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్, వెలుగు: ఖాకీ యూనిఫాంపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పోలీసులు పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త ఆఫీసర్లెవరూ సినిమాలను ఇమిటేట్ చేయొద్దని సూచించారు. ‘సింగమ్’ వంటి సినిమాల్లో చూపించినట్టు సూపర్కాప్లు అనుకోవద్దన్నారు. కొందరు అధికారులు మొదట్లో ‘షో’ చేసేందుకు ప్రయత్నిస్తుంటారన్నారు. ‘‘కొందరు అధికారులు ముందు షో చేద్దామనుకుంటారు. జనాన్ని భయపెడతారు. సింగమ్ వంటి సినిమాలను చూసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను ఏరేయాలని పరితపిస్తుంటారు. కానీ, అసలైన పనిని వదిలేస్తారు’’ అని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన 2018 బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లతో ఇంటరాక్ట్ అయ్యి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది ఉత్తమ ప్రొబేషనరీ అధికారిగా నిలిచిన తమిళనాడు కేడర్ ఐపీఎస్ డి.వి. కిరణ్శ్రుతిని ప్రధాని అభినందించారు.
టెక్నాలజీతో జాగ్రత్త
ప్రజలను భయపెట్టే పనులు చేయొద్దని కొత్త ఐపీఎస్‌లకు ప్రధాని హితవు చెప్పారు. తప్పులు చేసి చిక్కుల్లో పడొద్దని ఐపీఎస్‌లకు సూచించారు. కేసులను ఛేదించడంలో టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతోందో.. అంతే నష్టాలను చేస్తుందన్నారు. సీసీటీవీలు, మొబైల్ ట్రాకింగ్ వంటి టెక్నాలజీలు కేసులను ఛేదించేందుకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని, అదే టెక్నాలజీ చాలా మంది పోలీసులు సస్పెండ్ అవడానికీ కారణమవుతోందన్నారు. బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి టెక్నాలజీని మంచి కోసం ఎంత వరకు వాడుకోవచ్చో ప్రజలకు అధికారులు వివరించి చెప్పాలన్నారు. కాశ్మీర్ యువత చెడు దారుల్లో వెళ్లకుండా మహిళా పోలీసులు మార్చగలరని, వాళ్లకు ఆ శక్తి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. పిల్లలను మంచి దారిలో నడిపించేలా వాళ్ల అమ్మలను ఎడ్యుకేట్ చేసి, చెడు బాట పట్టిన వారిని వెనక్కు తీసుకురాగలరని అన్నారు. మహిళా పోలీసులు ఆ పని చేస్తారన్న గట్టి నమ్మకం తనకుందన్నారు. పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా మొదట్లోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాశ్మీర్ ప్రజలు ఎంతో మంచివారన్నారు.
ట్రైనింగ్‌కి ఫీల్డ్‌కి తేడా ఉంటుంది
అకాడమీలో తీసుకున్న ట్రైనింగ్‌కు, ఫీల్డ్‌లో డ్యూటీకి చాలా తేడా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రతి కేడర్‌లోనూ పనిభారం, ఒత్తిడి ఉంటుందని, ఫీల్డ్‌లో ఊహించని ఎన్నో ఘటనలు ఎదురవుతాయని చెప్పారు. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని సూచించారు. యువ ఐపీఎస్‌లతో తరుచుగా మాట్లాడుతుంటానని చెప్పారు. కరోనా టైంలో పోలీసుల మానవత్వం, సేవ గురించి ప్రజలకు తెలిసొచ్చిందని ప్రధాని అన్నారు. ప్రజలకు మహమ్మారి గురించి అవగాహన కల్పించడంతో పాటు.. చాలా మందికి ఫుడ్డు అందించడం, పేషెంట్లను ఆస్పత్రులకు తీసుకెళ్లడం వంటి పనులు చేశారని కొనియాడారు. పాటలు పాడుతూ కరోనాపై అవగాహన కల్పించారన్నారు. కరోనా కాలంలో చేసిన సేవలు పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాయని అన్నారు.
రాష్ట్రానికి 11 మంది ఐపీఎస్‌లు
45 వారాల పాటు ట్రైనింగ్ పొందిన 131 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లలో 28 మంది మహిళా అధికారులున్నారు. రాష్ట్రానికి 11 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లను కేటాయించారు. అందులో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ఏపీకి ఐదుగురు అధికారులను కేటాయించారు. పాస్ ఔట్ అయిన వారిలో 71 ఆర్ఆర్ 2018 బ్యాచ్‌కు చెందిన 121 మంది, 70 ఆర్ఆర్ 2017 బ్యాచ్‌కు చెందిన 10 మంది అధికారులున్నారు.
For More News..