
నయంకాని వ్యాధితో ఆరోగ్యం క్షీణించడంతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా స్మాల్ ఫైబర్ న్యూరోపతి, ఆటోనోమిక్ న్యూరోపతి అనే నయంకాని వ్యాధులతో బాధపడుతున్న 27ఏళ్ళ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ముంబైలోని వసైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ముంబైలోని వసైలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రెండేళ్లుగా నయంకాని వ్యాధులతో బాధపడుతున్నాడు. తన అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తడంతో తాను అద్దెకుంటున్న ఇంట్లోనే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బెంగళూరులో ఉంటున్న బాధితుడి సోదరి ముంబై పోలీసులకు ఈమెయిల్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడా ఇంటికి వెళ్లి చూడగా.. కిటికీలు, వాకిళ్లు సీల్ చేసి కనిపించాయి, లోపల కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఉంది.. లైట్స్ ఆన్ చేయొద్దు అంటూ ఓ నోట్ కిటికీకి అంటించి ఉంది. కార్పెంటర్ సాయంతో కిటికీలు బద్దలుకొట్టారు పోలీసులు.
లోపలికి వెళ్లి చూడగా.. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ సిలిండర్ కి మాస్క్ పెట్టుకొని కనిపించాడు బాధితుడు. రెండేళ్లుగా వ్యాధితో బాధపడుతున్నానని.. తన ఆరోగ్యం సహకరించక ఉద్యోగం కూడా చేయలేకపోతున్నానని.. ఒకరి మీద ఆధారపడి బతకడం తనకు ఇష్టం లేదని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు బాధితుడు. తనకు ఏ దారి కనిపించక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తనకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో సహకరించారని పేర్కొన్నాడు బాధితుడు. ఈ కేసును యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేసిన పోలీసులు.. గ్యాస్ సిలిండర్ సప్లయర్ కోసం ఆరా తీస్తున్నారు.