అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా పిల్లల్ని పెంచాలి: విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్

అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా పిల్లల్ని పెంచాలి: విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేక్
  • అప్పుడే గోల్డెన్​ సొసైటీ తయారవుతుంది 
  • ప్రజా సేవలో తరిస్తున్న వాసవి మహిళా సంఘం ఎంతో గ్రేట్

పద్మారావునగర్, వెలుగు: ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించగలుగుతామని, వాసవి మహిళా సంఘం నిర్వాహకులు నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటూ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని విశాక ఇండస్ట్రీస్​ ఎండీ, కాకా డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​ కరస్పాండెంట్​సరోజా వివేక్​ అన్నారు. గురువారం సికింద్రాబాద్ పీజీ రోడ్డులోని రబ్​జ్యోతి బిల్డింగ్ ఫస్ట్​ ఫ్లోర్​లో శ్రీవాసవి మహిళా సంఘం, స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్​మణిద్వీపం నూతన కార్యాలయాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సరోజా వివేక్ మాట్లాడుతూ.. బడి, గుడి, ఇల్లు, ఆడవాళ్లు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ స్వర్గసీమగా మారుతుందన్నారు. 80 శాతం మార్కులు సాధించిన స్టూడెంట్లకు అంబేద్కర్ విద్యా సంస్థల్లో ఫ్రీ స్పాన్సర్షిప్​ఇచ్చి చదివిస్తామని ప్రకటించారు. విమెన్ ఎంపవర్ మెంట్​అంటే మెన్ కంటే విమెన్ బెటర్ అని కాదన్నారు.

మెన్, విమెన్ కలిసి ఉంటే ఎన్నో సాధించగలుగుతామని తాను  నమ్ముతానన్నారు. మనలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని తట్టి లేపాలన్నారు. ఆడపిల్ల బరువు అనుకొన్న రోజుల నుంచి ఆడపిల్లలు ఎన్నో సాధిస్తున్నారనే రోజులు వచ్చాయన్నారు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా పిల్లలను సమానంగా పెంచాలని, అప్పుడే గోల్డెన్ సొసైటీ తయారవుతుందని చెప్పారు. ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారని.. స్కూళ్లలో కనీస అవసరాలైన వాష్​రూమ్స్​సరిగ్గా ఉండట్లేదన్నారు. తమ అంబేద్కర్ కాలేజీలోని వాచ్ మెన్ కూతురు కాలేజీ టాపర్గా నిలిచిందన్నారు.

ఆటో డ్రైవర్ అబ్బాయి స్టేట్ టాపర్గా నిలిచాడని ఇది ఎంతో గొప్ప విషయమన్నారు. 1976లో స్థాపించిన హైదరాబాద్ శ్రీవాసవి మహిళా సంఘం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఎందరో మహిళలకు ఉపాధి కల్పించడం గ్రేట్ అన్నారు. ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘ ప్రతినిధులు సరోజను ఘనంగా సత్కరించారు. వాసవి మహిళా సంఘం ప్రెసిడెంట్ కళాప్రియ, జనరల్​సెక్రటరీ మౌష్మి గుప్తా, ట్రెజరర్​కోటగిరి కృష్ణకుమారి, స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ అధ్యక్షులు శివకుమారి తదితరులు పాల్గొన్నారు.