అఫ్గానిస్థాన్‌ను తాలిబనిస్థాన్‌ అవ్వనీయం

అఫ్గానిస్థాన్‌ను తాలిబనిస్థాన్‌ అవ్వనీయం

తాలిబన్ల చెరలో చిక్కిన అఫ్గానిస్థాన్‌ను మళ్లీ కాపాడుకుంటామని మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్‌ మరోసారి ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబనిస్థాన్ అవ్వనీయబోమని ఆయన చెప్పారు. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత తనను కేర్‌‌టేకర్ ప్రెసిడెంట్‌గా ప్రకటించుకున్న అమ్రుల్లా ఆ దేశంలోని పంజ్‌షీర్‌‌ ప్రావిన్స్‌లో ఉండి తాలిబన్లపై పోరాటానికి దళాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జాతీయ మీడియా చానెల్ ఇండియా టుడే ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అమ్రుల్లా మాట్లాడుతూ అఫ్గాన్‌ ప్రజలు నియంతృత్వాన్ని ఒప్పుకోరని అన్నారు. 

‘‘ఎమిరేట్ ఆఫ్‌ తాలిబన్‌ను మేం తిరస్కరిస్తున్నాం.  అఫ్గానిస్థాన్‌.. తాలిబనిస్థాన్ అవ్వడం మాకు ఇష్టం లేదు. తాలిబన్లు కోరుకుంటున్నది జరగనీయబోం. చర్చలకు మేం సిద్ధమే.. కానీ అవి అర్థవంతంగా ఉండాలి. లేదంటే పోరాటంతో తిప్పికొట్టడానికీ మేం బలంగానే ఉన్నాం” అని అమ్రుల్లా సలేహ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తాలిబన్లు పంజ్‌షీర్‌‌లోని కొంత భాగాన్ని అక్రమించుకున్నామని ప్రకటించారని, అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన చెప్పారు. తమ కంట్రోల్ పట్టుతప్పలేదన్నారు. తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని, వాళ్ల నియంతృత్వాన్ని అంగీకరించబోమని చెప్పారు. అఫ్గాన్ ప్రజలకు స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై హామీ ఇస్తేనే చర్చలకు ముందుకు వస్తామని, లేదంటే పోరాటానికైనా సిద్ధమని అన్నారు.