
ఘజియాబాద్: ఢిల్లీ NCR పరిధిలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ డీలర్ గన్తో భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్తో ఈ హత్య, ఆత్మహత్య వెనుక కారణం తెలిసింది. ఘజియాబాద్కు చెందిన కుల్దీప్ త్యాగి(46) అనే రియల్ ఎస్టేట్ డీలర్కు, అన్షు త్యాగికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ భార్యాభర్తలకు ఇద్దరు మగ పిల్లలు. కుల్దీప్ త్యాగి తండ్రి రిటైర్డ్ పోలీస్.
ఘజియాబాద్ రాజా నగర్ రాధా కుంజ్ సొసైటీలోని ఇంట్లో నివాసం ఉంటున్న కుల్దీప్ త్యాగి తన లైసెన్స్డ్ రివాల్వర్తో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తన భార్యను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో వీళ్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పటికీ వేరే గదిలో ఉన్నారు. గన్ పేలిన శబ్దం వినిపించడంతో ఇద్దరు కొడుకులూ గదిలో వెళ్లి చూడగా తల్లీతండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. ఇద్దరూ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. కుల్దీప్ త్యాగి ఆ సూసైడ్ నోట్ రాసినట్లు తేల్చారు. ‘‘నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను. నా కుటుంబానికి ఈ విషయం తెలియదు. చికిత్స చేయించుకున్నా కోలుకోలేని స్థితిలో ఉన్నాను. అందుకే.. డబ్బును నా ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టి వృధా చేయాలనుకోవడం లేదు. అందుకే.. నా భార్యను కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతున్నాను. ఎందుకంటే.. కలకాలం కలిసి ఉంటామని ఒకరికి ఒకరం మాటిచ్చుకున్నాం. ఇది నా నిర్ణయం. ఇందుకు ఎవరినీ నిందించవద్దు. ముఖ్యంగా మా పిల్లలను దయచేసి తప్పుబట్టకండి.’’ ఇది కుల్దీప్ త్యాగి రాసిన సూసైట్ నోట్ సారాంశం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కుల్దీప్ త్యాగి, అతని భార్య మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.