నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి లభ్యతపై ఆరా తీశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో ప్రస్తుతం 35.370 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, 25 టీఎంసీల వరకు చేరుకుంటే నీటిని లిఫ్ట్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పారు.
నెలకు 2.4 టీఎంసీలు తాగునీటి కోసం సప్లై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సుధాకర్ సింగ్ తెలిపారు. 710 గ్రామాల్లో ప్రతిరోజు 79 లక్షల లీటర్ల తాగునీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 88 చెంచు పెంటలకు తాగునీటిని అందించేందుకు నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. లీకేజీ సమస్య తలెత్తకుండా చూడాలని, తనిఖీలు చేసి వెంటనే రిపేర్లు చేయాలన్నారు. ఎండలతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అనారోగ్యం పాలైన వారికి చికిత్స చేసేందుకు పీహెచ్‌సీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్ వో సుధాకర్ లాల్ కు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన ఆస్తి, పంట నష్టం వివరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు మను చౌదరి, మోతీలాల్, డీపీవో కృష్ణ, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు సుధాకర్ సింగ్, శ్రీధర్, హార్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర రావు, ఆర్డీవోలు నాగలక్ష్మి, పాండు నాయక్, హనుమాన్ నాయక్ పాల్గొన్నారు.
‘డబుల్’ ఇండ్ల వెరిఫికేషన్ కంప్లీట్
గద్వాల: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చేసుకున్న అప్లికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని, 25న వార్డుల్లో మీటింగ్ లు నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వార్డ్ మీటింగుల్లో పాల్గొనే ఆఫీసర్ల మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గద్వాల పట్టణానికి సంబంధించి పరమాల దగ్గర 560 ఇండ్లు కంప్లీట్ అయ్యాయని చెప్పారు. వాటి కోసం పట్టణంలోని 37 వార్డుల నుంచి 4 వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అర్హుల జాబితా రెడీ చేసినట్లు చెప్పారు.
25న వార్డులలో మీటింగ్ నిర్వహించి అర్హుల జాబితాను డిస్ ప్లే చేయాలని, ఎవరైనా అభ్యంతరాలు చెబితే వాటిని రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ప్రతి వార్డుకు జిల్లా స్థాయి ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీటింగ్ నిర్వహించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.