గ్లైఫోసెట్ ​కట్టడిలో ప్రభుత్వాల నిర్లక్ష్యం

గ్లైఫోసెట్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం. దేశంలో దీని వాడకంపై ఆంక్షలు విధిస్తూ 2020 జులై 2న ముసాయిదా నోటిఫికేషన్​ఇచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ.. ఈ నెల 25న తుది నోటిఫికేషన్ ​ప్రకటించింది. ప్రపంచంలో అత్యధికంగా వాడే ఈ కలుపు నాశక గ్లైఫోసెట్ పంపిణీ, అమ్మకం, వినియోగం నిషేధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం తాజా ముసాయిదాను విడుదల చేసింది. గ్లైఫోసెట్ అత్యంత ప్రమాదకరమని గుర్తించినా.. కేంద్రం దాన్ని పూర్తిగా నిషేధించలేదు. రెండేండ్ల నుంచి కేవలం ఆంక్షలు మాత్రమే పెట్టి, ఆ బాధ్యతను రాష్ట్రాలకు వదిలేయగా.. ఇటు తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించి చేతులు దులుపుకున్నాయి. ఫలితంగా గ్లైఫోసెట్ ​అమ్మకాలు, వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదకారి అయిన రసాయనం.. ఇటు రైతులను, అటు పర్యావరణాన్ని తీవ్రంగా నష్ట పరచగా.. తయారీ కంపెనీలకు మాత్రం లాభాలు చేకూర్చింది.

దేశంలోకి ప్రవేశించి..

ఏడెనిమిదేండ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ 3 పత్తి విత్తనాలు దేశంలోకి వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ వీటి విస్తృతిని నివారించే ప్రయత్నాలు చేపట్టలేదు. బాధ్యుల మీద క్రిమినల్ చర్యలూ తీసుకోలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక హెచ్​టీబీటీ పత్తి విత్తనాల మార్కెట్ 40 శాతానికి పెరిగి ఉంటుందని ఒక అంచనా. విత్తనాలను మార్కెట్ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేక, మధ్యేమార్గంగా గ్లైఫోసెట్‌‌ను నియంత్రించాలని ఒక కేంద్ర కమిటీ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కేంద్రం ఆ పని చేయక, మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి అని రాష్ట్రాలకు చెప్పింది. దీంతో గ్లైఫోసెట్‌‌ మీద కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా మూడేండ్లు గ్లైఫోసెట్‌‌పై 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. చట్ట విరుద్ధమైన, హెర్బిసైడ్ -తట్టుకునే బీటీ పత్తి విత్తనాలు వాడకుండా అరికట్టడానికే గ్లైఫోసెట్​మీద ఈ తాత్కాలిక నిషేధం అని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా గ్లైఫోసెట్ ను ఉపయోగించరాదు. అంటే సాధారణ రైతులు వాడరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే వాడాలనే కొత్త నిబంధన తెచ్చింది. ఎందుకు అంటే కలుపునాశక గ్లైఫోసెట్ పంపిణీ, అమ్మకం, వాడకం జన్యుమార్పిడి పంటలతో ముడిపడి ఉంది. ప్రత్యేకంగా హెర్బిసైడ్ -తట్టుకునే జన్యుమార్పిడి రకాలతో దీని ఉపయోగం ముడిపడి ఉంది. హెచ్ టీ బీటీ జన్యుమార్పిడి పంటలకు మన దేశంలో మొన్నటి వరకు అనుమతి లేదు. జన్యుమార్పిడి ఆవాలకు ఇదే నెలలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ(జీఈఏసీ) అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. తుది ప్రకటన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రావాల్సి ఉంది. హెచ్​టీబీటీ పత్తి విత్తనాలకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కోరిన దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వాటికి కూడా త్వరలో అనుమతి ఇస్తారని తెలుస్తున్నది.

పనిచేయని వ్యూహం..

గ్లైఫోసెట్​ప్రమాదకరమని భావిస్తే కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా దాన్ని నియంత్రించవచ్చు. ఆ అధికారం కేంద్రానికి ఉన్నది. కానీ దాన్ని ఆదిలోనే నిషేధించ లేదు. జన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తనకున్న అధికారాలను, బాధ్యతలను కేంద్రం నిర్లక్ష్యం చేసింది. దీంతో 8 ఏండ్ల క్రితం దేశంలో పెద్దగా మార్కెట్ లేని గ్లైఫోసెట్, చట్టపరంగా అనుమతి లేని హెచ్​టీ బీటీ పత్తి విత్తనాల రాకతో విపరీతంగా పెరిగింది. కేంద్రం అనుమతి లేని హెచ్​టీ బీటీ పత్తి విత్తనాల ఉపయోగం అరికట్టే బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టింది. చట్ట వ్యతిరేక హెచ్​టీ బీటీ లేదా బీజీ 3 విత్తనాలను అరికట్టాలంటే, గ్లైఫోసెట్ ఉపయోగం మీద ఆంక్షలు పెట్టడం ద్వారానే సాధ్యం అని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు గతంలో ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చినా.. ఎక్కడా పెద్దగా ప్రయోజనం జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పురుగు మందుల నియంత్రణ చట్టం –1968ను ఉపయోగించి 60 రోజుల వరకు ఏదైనా పురుగు మందును నిషేధించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో నిషేధించే అధికారాలు మాత్రం రాష్ట్రాలకు లేవు. అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరిగా కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు ఆ అవకాశం ఉంది. కేరళ ఆ ప్రకారమే గతంలో ఎండోసల్ఫాన్​మీద చర్యలు చేపట్టింది. ఇప్పుడు గ్లైఫోసెట్ మీద కూడా అక్కడ పూర్తి నిషేధం ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఇలాంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. తాత్కాలిక నిషేధం కోసం ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ చాలా లొసుగులు ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, నిషేధానికి జిల్లాల వారీగా ఒక ఆచరణాత్మక ప్రణాళిక తయారు చేసి ఉండవచ్చు. అట్లాంటి ప్రణాళిక ఎన్నడూ చేయలేదు. 

ఆంక్షల అమలు సరిగా లేక..

తెలంగాణ ప్రభుత్వం 2018 నుంచి గ్లైఫోసెట్ వాడకంపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా పత్తి పంట కాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు గ్లైఫోసెట్ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక అనవాయితీగా వస్తున్నది. ఏపీ, మహారాష్ట్రలు కూడా ఇలాంటి ఆంక్షలే విధించాయి. కానీ వాటి అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ఏటా గ్లైఫోసెట్ అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆంక్షలున్నా దుకాణాల్లో ఆ రసాయన డబ్బాలు దొరుకుతున్నాయి. పెస్టిసైడ్​ యాక్షన్​ నెట్​వర్క్ ​ఇండియా అనేక సూచనలు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైతులకు పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు/విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి వివిధ కారణాల వల్ల, రైతులు తమ పంటలు రౌండప్ రెడీ కానప్పటికీ, గ్లైఫోసెట్ వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అనేక గ్రామాల్లో, రైతులు తాము కొన్నవి గ్లైఫోసెట్ తట్టుకునే విత్తనాలు అనుకొని, గడ్డి కలుపు నివారణకు వాడుతున్నారు. దాని వల్ల మొత్తం పంట మాడిపోయి నష్టపోతున్న ఉదంతాలు ఉన్నాయి. వారు కొన్నవి చట్ట వ్యతిరేక విత్తనాలు, గ్లైఫోసెట్ వాడకం మీద ఆంక్షలు ఉండటంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. అటు చట్ట వ్యతిరేక విత్తనాలు అమ్ముతున్న కంపెనీలు లాభాల బాట పట్టగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. 

ఎందుకు నిషేధించాలంటే..

గ్లైఫోసెట్‌‌ను పూర్తిగా నిషేధించడం చాలా అవసరం. నిషేధం సరిగా లేక పొరుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వస్తున్నది. చట్టవిరుద్ధమైన హెచ్‌‌టీ బీటీ పత్తి విత్తనాలు, ఇతర జన్యుమార్పిడి పంటలు అందుబాటులో ఉన్నంతకాలం ఆంక్షలు పని చేయవు. ప్రకృతిని కాపాడుకోవడానికి, పర్యావరణ రక్షణకు, రైతులు, గ్రామీణ కుటుంబాల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక కారణాల దృష్ట్యా గ్లైఫోసెట్ నిషేధం అత్యంత అవసరం. దాని తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై పూర్తి నిషేధం అవసరం. గ్లైఫోసెట్ వల్ల క్యాన్సర్‌‌ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్నది. దీని తయారీ కంపెనీల మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు నమోదయ్యాయి. గ్లైఫోసెట్ కారణంగా తనకు క్యాన్సర్‌‌ సోకిందంటూ కోర్టుకెక్కిన ఒక స్కూలు తోటమాలికి దాదాపు రూ.2,000 కోట్ల పరిహారం చెల్లించాలని గ్లైఫోసెట్​తయారీ సంస్థను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. మన దేశంలో ఎలాంటి అధ్యయనాలు లేవు. 2019లో గజ్వేల్ ప్రాంతంలో ఒక అమ్మాయి పొలం ఒడ్డు మీద కూర్చుని ఏదో ఆలోచనలో పక్కనున్న గడ్డిపరకను నోట్లో పెట్టుకున్నది. అంతకు ముందే దాని మీద గడ్డి మందు పిచికారి చేసిన విషయం ఆమెకు తెలియదు. దాన్ని నోట్లో పెట్టుకున్నందుకు ఆమె ఆ రసాయన విషం బారిన పడి చికిత్స అందించినా బతకలేదు. గ్లైఫోసెట్‌‌ను చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్నీ రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతుందని గ్లైఫోసెట్‌‌ మందును చల్లుతున్నారు. కానీ  ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు గ్రహించడం లేదు. దాదాపు35 దేశాల్లో గ్లైఫోసెట్‌‌ మీద నిషేధం ఉంది. -డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్