రీజనల్ రింగ్ రోడ్డు అక్కర్లేని ప్రాజెక్ట్

రీజనల్ రింగ్ రోడ్డు అక్కర్లేని ప్రాజెక్ట్

హైదరాబాద్ నగరం చుట్టూ 340 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఈ కొత్త రోడ్డు (గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్) వల్ల కనీసం 30 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతారు. గత నెల 23, 25 తేదీల్లో ఈ రహదారి నిర్మాణం మీద ప్రభుత్వం రెండు చోట్ల మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు పెట్టింది. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి చౌటుప్పల్ వరకు158 కి.మీ పొడవు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీని వల్ల సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోని 84 గ్రామాలు/ పట్టణాలపై నేరుగా ప్రభావం పడుతుందని అంచనా. అయితే, ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే స్పష్టత లేదు. గ్రామాలు మొత్తం ఖాళీ అవుతాయా? లేక కొంత మేర భూమి మాత్రమే పోతుందా? ప్రజలకు ఈ విషయాలు స్పష్టం చేయలేదు. ఈ రహదారి నిర్మాణం వల్ల పర్యావరణం మీద పడే ప్రభావం గురించిన నివేదిక(ఈఐఏ)లో ఈ రహదారిని ‘కనీసం100 మీటర్ల వెడల్పు గల ఆర్వోడబ్ల్యూ’గా పేర్కొన్నారు. ఇంకా వెడల్పు ఉండవచ్చు. మొదట్లో 4 వరుసల రహదారి అన్నారు. తరువాత 6 వరుసలు అయింది. మున్ముందు 8 వరుసలు ఉంటాయంటున్నారు. ఈ లెక్కన ఈ కొత్త రోడ్డు వైశాల్యానికే 8,000 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ జాగా అవసరం ఉంటుంది. 11 ఇంటర్ చేంజ్ లు/జంక్షన్ లు ప్రతిపాదించారు. వీటికి ఇంకా రహదారి సంబంధిత అవసరాలు దృష్టిలో పెట్టుకుంటే, ఈ 158 కి.మీ రహదారికి అవసరమైన భూమి కనీసం 8,250 నుంచి 8,500 ఎకరాల దాకా ఉంటుంది.

సహజ సంపద ధ్వంసం

158 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణం కోసం నరికివేయాల్సిన చెట్లు, అడవుల నాశనం గురించి వాస్తవ అంచనా వేయలేదు. 4 జిల్లాల్లో 79.23 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉంటుందని మాత్రం చెప్పారు. రికార్డుల ప్రకారం ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాలు కలిపి(ప్రస్తుతం 4 జిల్లాలు) 1,74,287 హెక్టార్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఈ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఉన్నదే తక్కువ అంటే.. ఇప్పుడు కొత్త రహదారి నిర్మాణంతో అటవీ విస్తీర్ణం మరింత తగ్గనుంది. కొత్త రహదారి వల్ల రైతులు, పశువుల కాపరులు, గ్రామస్థాయి వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితం కానుంది. 200 మీటర్ల వెడల్పు గల రహదారి నిర్మాణానికి కావాల్సిన మట్టి, రాళ్లు, ఇతర సామాగ్రికి, సమీప గ్రామాల వ్యవసాయ భూములు, కంచే భూములను తవ్వి నాశనం చేస్తారు. ఈ రోడ్డు స్థానికులకు మధ్యలో అడ్డుగోడగా పరిణమిస్తుంది. విస్తృతమైన ప్రాంతంలో పశువులు తమ మేత ప్రాంతాలను కోల్పోతాయి. జీవనోపాధులు దెబ్బతింటాయి. రైతులు, ఇతరులు తమ ఆస్తులను కోల్పోతారు. 84 గ్రామాలు/పట్టణాల్లోని కనీసం 2 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు. భూ నిర్వాసితుల గురించి, తరిగిపోయే సహజ వనరుల గురించి, ఆస్తులు,పని ప్రాంతాలను విభజించే ఈ విశాలమైన కొత్త రోడ్డు వేస్తే వచ్చే పర్యవసానాల గురించి నిజమైన, వాస్తవిక, కచ్చితమైన అంచనాలు వేయలేదు. ఈ భారీ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టులో భారీ యంత్రాల ఉపయోగం వల్ల దుమ్ము, ధూళి శాతం పెరుగుతుంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అస్థిత్వం కోల్పోతాయి. కొత్త రోడ్డుకు కంకర, సున్నం, బిటుమినస్ మెటీరియల్స్ ​తోపాటు 85 లక్షల టన్నుల మట్టి అవసరమని ఒక అంచనా. ఇంత మట్టి తీయడం వల్ల స్థానిక నేలలు, వృక్షసంపద, చెట్లు, అడవులు, స్థానిక జీవావరణం పైన పడే దుష్ప్రభావం గురించి ఎక్కడా వివరాలు లేవు. ఎక్స్ ప్రెస్ రోడ్డు వల్ల స్థానిక వాతావరణంలో భార లోహాల కాలుష్యం పెరుగుతుంది. తద్వారా, స్థానిక నీటి వనరుల కాలుష్యం, పర్యావరణం మీద ప్రభావం ఉంటుంది. 

ప్రజాభిప్రాయానికి విలువేది?

ఓఆర్ఆర్ కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామంటున్నారు. ఈ రహదారి ప్రాజెక్టు వల్ల  సారవంతమైన వ్యవసాయ భూములను, గ్రామాలను కోల్పోవాల్సి వస్తుంది. స్థానిక ప్రజానీకానికి అతి తక్కువ ప్రయోజనాలు ఉండే ఈ ప్రాజెక్టు వల్ల విలువైన వ్యవసాయ భూమి పోతుంది. రియల్ ఎస్టేట్ వల్ల భూముల ధరలు మాత్రం పెరుగుతాయి. దీని వల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదు. వారికి మిగిలేది నష్టమే. ఈ రోడ్డు వల్ల ప్రభావితమయ్యే అనేక గ్రామాల రైతులు వివిధ ప్రాజెక్టుల్లో తమ భూములను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్త రోడ్డుకు భూమి కోల్పోయిన వాళ్ల పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా మారింది. తెలంగాణలో భూ సేకరణ న్యాయబద్ధంగా ఎప్పుడూ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రింగ్ రోడ్డు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ప్రజలు ఈ రింగ్ రోడ్డు నిర్మాణం అడగలేదు. ప్రజలు తమ అభివృద్ధిని ఎంచుకునే అవకాశం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ స్ఫూర్తికి, లక్ష్యాలకు దూరంగా చేపట్టడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజలందరూ విస్తృతంగా ఈ రహదారి నిర్మాణం మీద అభిప్రాయం చెప్పే అవకాశం ప్రజాస్వామ్యం దేశంలో కొరవడటం శోచనీయం. వాస్తవానికి ఆర్ఆర్ఆర్​ఆవశ్యకత గురించి తెలంగాణ శాసనసభలో కానీ, పార్లమెంటులో కానీ ఎక్కడా వివరించలేదు.

స్థానిక ప్రజలకు ఉపయోగం లేదు

హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రస్తుత158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డుకు 6,500 ఎకరాల భూమిని సేకరించారు. కొత్త రింగ్ రోడ్డులో అంతే దూరానికి అంతకంటే తక్కువ భూమితో నిర్మాణం ఎట్లా సాధ్యం? కానీ ఈఐఏలో 1,865 హెక్టార్లు(4,608.51 ఎకరాలు) మాత్రమే అవసరమని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సర్వీసు రోడ్లు ఉండవని ఒక దగ్గర, ఉంటాయని మరో చోట చెప్పారు. “ప్రతిపాదిత కొత్త రోడ్డు వల్ల స్థానిక వ్యవసాయం మెరుగు అవుతుంది. రైతులు తమ ఉత్పత్తులకు తగిన విలువ పొందడానికి, ఈ ప్రాంతానికి మరింత పెట్టుబడిని ఆకర్షించడానికి దోహదపడుతుంది. తద్వారా ఈ ప్రాంత, రాష్ట్ర, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తుంది’’ అని అంటున్నారు. వాస్తవానికి, రైతులు, వారి పశువులు, ట్రాక్టర్లు లేదా ఏదైనా ఇతర వ్యవసాయ వాహనం కూడా ఈ రహదారిని ఉపయోగించలేరు. అటువంటప్పుడు ఇది స్థానికులకు ఎట్లా ప్రయోజనకారి? మరోవైపు, స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఆహార ఉత్పత్తి, పర్యావరణం, జీవావరణంపైన పడే ప్రతికూల ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయలేదు.

రోడ్డు ప్రమాదాలు

2020లో ఎక్స్ ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 47,984 మంది మరణించగా, 2019లో 53,872 మంది చనిపోయారని2021 డిసెంబర్ 9న ప్రభుత్వం పార్లమెంటుకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రమాదాలకు రోడ్డు ఇంజనీరింగ్(పాదచారుల క్రాసింగ్), అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ముఖ్య కారణాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని బట్టి ఈ కొత్త, ప్రాంతీయ ఎక్స్ ప్రెస్ వే 4 జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలను పెంచుతుంది. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల 1,31,714 మరణాలు సంభవించాయి. లోక్ సభ(జులై 28, 2022) లో మంత్రి అంగీకరించినట్లు రహదారి ప్రమాద మరణాల్లో దాదాపు 70 శాతం అతివేగం వల్ల జరుగుతున్నవే. అయినా వేగంగా వెళ్లేందుకు ప్రభుత్వం వేల కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తున్నది. వాహనాలు గంటకు120 కి.మీ వేగంతో కదలడానికి ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తున్నందున అతి వేగం ప్రమాదమని సర్కారే ఒప్పుకుంటునప్పుడు, కొత్త రోడ్డు అవసరమా ? అనే ప్రశ్న వస్తుంది. కొత్తరోడ్డు మరిన్ని ప్రమాదాలు, మరింత వాయు కాలుష్యానికి కారణం కాదా? ఓర్ఆర్ఆర్ పైనా 80 శాతం ప్రమాదాలు అతివేగం వల్లే జరుగుతున్నాయి.  రాచకొండ పోలీసుల లెక్కల ప్రకారం ప్రకారం.. ‘2018లో ఓవర్ స్పీడ్ కేసులు 75 వేలు ఉంటే 2019 నవంబర్​వరకు 1.17 లక్షలకు పెరిగాయి’. మహబూబ్ నగర్ జిల్లాలో రహదారి మీద బాటసారుల మరణాల వల్ల వితంతువుల సంఖ్య పెరిగిందని, దాన్ని అరికట్టాలని హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎత్తైన రహదారి వల్ల పక్క గ్రామాల్లో వర్షాకాల వరదలు వస్తున్నాయని, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు వల్ల ఇలాంటి దుష్ఫలితాలే ఉంటాయి. - దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్