రాష్ట్రంలో వరదలను ఆపలేమా?

పర్యావరణ విధ్వంసంతో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఈ రోజు జీవన్మరణ పరిస్థితికి చేరుకున్నాయి. ప్రకృతి వనరుల భక్షణ మీద నిర్మాణమైన ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు రావడం లేదు. అక్కడక్కడ కొన్ని మార్పులు చేస్తున్నా ఫలితాలు మాత్రం రాలేదు. ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితాలను, సమాజాలను, దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో ఈ నెలలో పడిన కుండపోత వర్షాల వల్ల వచ్చిన వరదలు ప్రజలకు, పర్యావరణానికి కలిగించిన హాని పునరావృతం కాకుండా నివారించడానికి మార్గాలను అన్వేషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి. క్లౌడ్​బరస్ట్​వల్ల గోదావరిలో వరదలు వస్తున్నాయని, ఇలాంటి మేఘావృతం వెనుక విదేశీ హస్తం ఉందని రాష్ట్ర సీఎం కేసీఆర్​వ్యక్తం చేసిన రాజకీయ సందేహం దురదృష్టకరం. గోదావరిలో వరదలకు కారణం క్లౌడ్​బరస్ట్ అనే రాజకీయ సిద్ధాంతానికి ఆధారాలు లేవు. శాస్త్రీయ రుజువులూ లేవు. తెలంగాణకు సైన్స్ ఆధారిత ప్రజా విధానాలు, విపత్తు నిర్వహణ ప్రణాళికలు అవసరం. వాతావరణ సంక్షోభాన్ని అనుసరించే విపత్తుల వల్ల కలిగే దుఃఖాన్ని తగ్గించడం ఒక పాండిత్య దృక్పథంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విపరీతమైన వాతావరణ సంఘటనలకు ప్రధాన కారణాలను ప్రభుత్వం అన్వేషించాలి. నిపుణులతో, ప్రజలతో సంప్రదింపులు చేసి తగిన విధానాలను సుస్ఠిరపరచాలి. తగిన ఉపశమన చర్యలు చేపట్టాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధానాలను అభివృద్ధి చేయాలి.

వచ్చే నెలల్లో వర్షాలపై ఆందోళన
తెలంగాణలో సాధారణంగా నైరుతి రుతుపవనాల ద్వారా 80 శాతానికి పైగా వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 60% లేదా అంతకంటే అధిక వర్షపాతం నమోదైంది. లా నినో కారణంగా సాధారణం కంటే అధిక వర్షపాతంతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా విపరీతమైన వాతావరణం కారణంగా, రాష్ట్రంలో అధిక వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల వల్ల కాకుండా అరేబియా సముద్రం నుంచి వచ్చి, పడమర నుంచి తూర్పుకు పయనిస్తున్న పవనాల వల్ల వర్షాలు పడ్డాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ కుండపోత వర్షాలకు రాష్ట్రం అంతటా వరదలు రాగా, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తాయి. 2020లో కూడా ఉత్తర తెలంగాణాలో వరదలు వచ్చాయి. ఈసారి జులైలోనే వర్షపాతం పెరగడంతో ఆగస్టులో పరిస్థితి ఎట్లా ఉంటుందనే ఆందోళన నెలకొంది.

ముంపు అంచనా ఏది?
 భారీ సాగు నీటి ప్రాజెక్టులకు అధిక వర్షాల వల్ల ముప్పు ఉందని భావిస్తుండగా, అసలు వరదలు లేని ప్రాంతంలో ఈసారి వరదలు రావడానికి ఈ ప్రాజెక్టులే కారణంగా కనపడుతున్నది. ప్రతి సాగు నీటి ప్రాజెక్టు నిండితే, దాని వెనుక ఉన్న ఊర్లు, పంట పొలాలు మునుగుతున్నాయి. ఇంజనీర్ల అంచనాలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మరోవైపు, సాగు నీటి ప్రాజెక్టులు నిండే దాకా ఆగి, నిండినాక ఒకటేసారి వదిలిపెడుతున్నారు. పరివాహక ప్రాంతంలో వర్షంతో నీటి ప్రవాహం అంచనా వేసే పరికరాలు ఉండగా, అవి పని చేసే వ్యవస్థ లేకపోవడంతో నిండే దాకా ఏమి చేయక ఆ తరువాత గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. ఇరిగేషన్ నిర్వహణ వ్యవస్థ సరిగా లేక ఊర్లను కష్టాలలోకి నెడుతున్నారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి, కడెం, మానేరు తదితర ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నది. నిర్మాణ ప్రణాళికలు సరిగా లేవు. వరద నివారణకు కడుతున్న ప్రాజెక్టులు వరదలకు కారణమవడం తెలంగాణాలో జరుగుతున్న దురదృష్టకర చోద్యం. గోదావరి నదికి అడ్డంగా పోలవరం ప్రాజెక్టు కట్ట ఎత్తు వల్ల భద్రాచలం పట్టణం మునుగుతోందని నిరసిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఉన్న భారీ సాగు నీటి ప్రాజెక్టుల వల్ల ఏయే పట్టణాలు, ఊర్లు మునుగుతున్నాయో అంచనా వేయకపోవడం శోచనీయం. 

అటవీ విస్తీర్ణం తగ్గి..
భారీ సాగు నీటి ప్రాజెక్టులు వ్యవసాయానికి ఉపయోగపడటమే కాకుండా వాతావరణ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. అవి ఉన్న ప్రాంతాల్లో భూమి ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. చెరువులు, కుంటలు కూడా ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు తేమతో కూడిన వేడి ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల సమీప ప్రాంత ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది. వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. అడవుల నిర్మూలన వల్ల కూడా ఈ ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తర తెలంగాణాలో గత 15 ఏండ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఒకప్పటి కీకారణ్యాలు లేవు. వర్షం పడితే వాగుల్లో నీరు తక్షణమే చేరడంతో, నదుల్లో వరద గంటలు, రోజుల్లోనే పెరుగుతోంది. అడవులు ఉంటే వర్షపు నీరు ప్రవాహంగా మారడానికి కొంత సమయం పడుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర జిల్లాలు యావత్మల్, చంద్రపూర్, గడ్ఛిరోలి, ఛత్తీస్​గఢ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం చాలా వేగంగా తగ్గిపోయింది. వృక్షాలు, ఇంకా ఇతర జీవవైవిధ్యం కోల్పోతున్న గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు ఇంకా భీకర రూపం దాల్చే కారణభూత పరిస్థితులు వస్తున్నాయి. సాధారణ ప్రజలు, వ్యవసాయం, ఇతర జీవనోపాధులు దెబ్బతిని వలసలు, పేదరికం పెరుగుతాయి. ఆదివాసీ జనాభా అధికంగా ఉండే ఈ పరివాహక ప్రాంతంలో గణనీయ మార్పులు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే, అన్ని రాష్ట్రాలు కలిసి సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి తగిన పాలనాపర చర్యలు చేపట్టాలి.

విధానపర నిర్ణయాలు చేస్తేనే..
అధిక వేడి, అధిక వర్షాలు ఈ మూడు నెలలకే పరిమితం కావని సైంటిస్టులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అధిక వర్షాలు రావచ్చు. వస్తే పరిస్థితి ఏంది? ఇప్పటికే అన్ని విధాలుగా నష్టపోయిన కుటుంబాలు, ఊర్లు, ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే కుండపోతలు మళ్లీ వస్తే ఏమవుతుంది? రాబోయే విపత్తులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పుడు వచ్చిన కష్టానికే స్పందన పూర్తిగా లేకపోవడం గమనిస్తున్న ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న ఆశ లేదు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే ప్రభుత్వ విధానాల కోసం సర్వ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. వాతావరణ మార్పుల ప్రభావాలు విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఏడాదికేడాదికి స్పష్టత వస్తున్నప్పటికీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలు అన్వేషించడం లేదు. రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థను త్వరగా శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లించాలి. పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులు వేగంగా పెంచాలి. ప్రకృతి విలయ తాండవం నుంచి తప్పించుకోవాలంటే సరైన ప్రభుత్వ విధానాలు కావాలి. రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేసే విధంగా ఒత్తిడి పెరగాలి. పర్యావరణ స్పృహ పెంచుకున్న ప్రజల నుంచి ఒత్తిడి వస్తే మార్పు రావచ్చు. ఎన్నికల వేళ పర్యావరణ విధ్వంసం తగ్గించే విధానాల మార్పు కోసం కృషి చేస్తామని పొలిటికల్ పార్టీలు  వాగ్దానాలు చేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి.

వరదలకు కారణాలు ఇవేనా?


తెలంగాణతో పాటు దక్షిణాసియాలో అధిక వేడి రోజులు పెరిగాయి. పాకిస్తాన్ లో జాకోబాబాద్ లో 50 డిగ్రీల వేడి నిరంతరంగా 51 రోజుల పాటు ఉన్నది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత మే నెలలో 40 నుంచి 43 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య, సగటు కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబర్, జనవరి నెలల్లో 13 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. అయితే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత ఉన్న రోజుల సంఖ్య పెరిగాయి. అంతకు ముందు మార్చి నెల నుంచి తెలంగాణలో తీవ్ర వేడి వాతావరణం నెలకొంది. విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది. తెలంగాణాలో తలసరి విద్యుత్ వాడకం 2014 -15లో 1,356 యూనిట్ల ఉంటే, 2019 - 20 నాటికి 2,071 యూనిట్లకు పెరగడంలో ఈ కోణం కూడా ఉంది. మార్చి నెలలో అత్యధికంగా 8,071, ఏప్రిల్​లో 7,182, మే నెలలో 5,792, జూన్​లో 5,310 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధిక వేడి వల్ల నిండా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరు ఆవిరై గాలిలో తేమ శాతం పెరుగుతుంది. ఇది మళ్లీ అధిక వర్షం రూపంలో మనం ఎదుర్కుంటున్నాం. వర్షాకాలం(జులై - సెప్టెంబర్)లో తేమ 80 % వరకు ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో  తేమ సాధారణంగా 25 నుంచి 30% కన్నా తక్కువగా ఉంటుంది. గత 40 ఏండ్లలో వేడి వల్ల తేమ ఒత్తిడి విపరీతమైన స్థాయికి చేరింది. గాలిలో అధిక తేమ ఒక సమస్యగా పరిణమించింది. - దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్