ప్రకృతి విపత్తుల నుంచి ప్రపంచం పాఠాలు నేర్వాలి!

ప్రకృతి విపత్తుల నుంచి ప్రపంచం పాఠాలు నేర్వాలి!

దేశంలో 2022 జనవరి1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 273 రోజుల్లో 241 రోజులు తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు సంభవించాయి. వడగాల్పులు, శీతల గాలులు, తుఫానులు, మెరుపులు, భారీ వర్షాలు, కరువు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటివి అందులో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డౌన్ టు ఎర్త్ (డీటీఈ) మ్యాగజైన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇదే కాలంలో మధ్యప్రదేశ్​లో ప్రతి రెండో రోజు ఒక ఘటన జరిగింది. తెలంగాణలో 41 నమోదైతే, ఏపీలో45 ఉత్పాతాలు సంభవించాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అంచనాలు ఉన్నా, వాటిపై పూర్తిగా సర్వే చేయలేదు. తెలంగాణాలో అధిక వర్షాలతో వచ్చిన వరదలు గోదావరి ప్రాంతంలో కనీసం15 లక్షల ఎకరాల పంటను ముంచెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాల మీద అధ్యయనం చేయలేదు. రైతులను పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం గురించి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు, ఏ రూపంలో, ఎంత తీవ్రతతో వచ్చి పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ఊహించని స్థాయిలో విధ్వంసం

దేశంలో సంభవిస్తున్న వరుస ఉత్పాతాలు భూమిపై వాతావరణ మార్పునకు సూచికలు. ఇదివరకు వందేండ్లలో వచ్చిన మార్పుగా భావిస్తే, ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు ఐదేండ్లలో ఒకటి లేదా అంతకంటే తక్కువ కాలంలోనే చూస్తున్నాం. క్రిస్టియన్ ఎయిడ్ అనే సంస్థ వాతావరణ సంక్షోభంతో ప్రభావితమైన 2022లో ప్రపంచంలో10 భారీ నష్టం కలిగించిన తీవ్ర వాతావరణ ఉత్పాతాలను ఒక అధ్యయనంలో గుర్తించింది. ప్రతీది రూ.25 వేల కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. ఈ నివేదిక పేద దేశాల్లో భారీ ప్రాణ, పర్యావరణ నష్టాన్ని కలిగించిన10 ఇతర తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలను కూడా పరిశీలించింది. పాకిస్తాన్ లో మొన్న జూన్​లో కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన వరదలు 1700 మంది ప్రాణాలను తీసి, 70 లక్షల మందిని నిర్వాసితులను చేశాయి. 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. సెప్టెంబర్ లో అమెరికా, క్యూబాలను తాకిన హరికేన్ ఇయాన్ 100 బిలియన్ డాలర్లు, బ్రిటన్, యూరప్ ను నాశనం చేసిన వేసవి వడగాల్పులు, కరువు 20 బిలియన్​డాలర్ల నష్టాలను మిగిల్చాయి. వరదలు, తుఫానులు, కరువుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు చనిపోయారు. నిరుడు ఈజిప్ట్ లో జరిగిన కాప్​27లో నష్ట పరిహారం గురించిన ఒప్పందం గురించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ నివేదిక అన్ని దేశాలను కోరింది. 

పేదలపై తీవ్ర ప్రభావం

బొగ్గు, పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాల ఉపయోగం నుంచి వెలువడిన కాలుష్యం వల్ల ఈ ప్రకృతి విపత్తులు వేగంగా దూసుకొస్తున్నాయి. వాటి వాడకం తగ్గిస్తామని ప్రతి దేశం స్వతహాగా లక్ష్యాలు ప్రకటించాయి. అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ఈ లక్ష్యాలు సరిపోవు. 2015లో జరిగిన పారిస్ ఒప్పందం ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈజిప్టులో జరిగిన కాప్​27 వాతావరణ శిఖరాగ్ర సమావేశం నుంచి ఈ దిశగా చర్చ జరగలేదు. అన్ని దేశాలు అత్యవసర చర్యలు తీస్కోవాల్సిన అవసరం 2022లో జరిగిన వరుస ఉత్పాతాలు గుర్తు చేస్తున్నా, దేశాధినేతలు కదలకపోవడం విస్మయం కలిగిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా అసాధారణమైన ఆర్థిక, సామాజిక నష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణ ప్రజలు అనేక అనారోగ్య పరిస్థితులను నిత్య జీవనంలో ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే స్థితిలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు లేవు. అందుకు పాక్​ఒక ఉదాహరణ. నిరుటి వరదల బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు, ఆయా ప్రాంతాల్లో కోల్పోయిన మౌలిక సదుపాయాల నష్టానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఏమి చేయలేని దుస్థితిలో ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన సాయం అరకొర మాత్రమే.

భారత ప్రభుత్వమూ దృష్టి పెట్టాల్సిందే..

ఇప్పటికే ప్రపంచ ఆహార భద్రతను అనేక భౌగోళిక పరిస్థితులు బలహీనపరుస్తున్నాయి. కొవిడ్19, భౌగోళిక రాజకీయ, శక్తి, జీవన వ్యయ సంక్షోభాలు ఆహార లేమిని తీవ్రతరం చేస్తున్నాయి. 1981-–2010 సగటుతో పోలిస్తే 2020లో 9.8 కోట్ల ప్రజలు మితమైన లేదా తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నారని ఇటీవలి లాన్సెట్ కౌంట్​డౌన్ 2022 నివేదిక తెలిపింది. 2022 నాటి  వడగాల్పులు, కరువు వంటి తీవ్రమైన సంఘటనలతో ఆహార భద్రతపై ఒత్తిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండేండ్లుగా  ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన తీవ్ర వాతావరణ ఘటనలు అంతర్జాతీయ సమాజానికి మేల్కొలుపుగా ఉండాలి. ఐరోపా, అమెరికా, చైనా దేశాల్లో భారీ మంచు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్ర వడగాల్పులు అక్కడి ప్రజలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అక్కడి రాజకీయ వ్యవస్థ ఈ ఒత్తిడితో అలజడి స్థితిలో ఉంది. ఆశ్చర్యంగా, భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకు, పార్టీలకు ఇవేమీ పట్టడం లేదు. వారు ఈ ఉత్పాతాలను సాధారణంగా పరిగణిస్తున్నారు. రాబోయే వేసవిలో ఎండలు విపరీతంగా ఉండవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను జాగరూకులను చేస్తూ, ఉపశమన చర్యలకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలి. ఎక్కడో అమెరికాలో తుఫానుల గురించి చెబుతున్న మీడియా, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న, జరగబోయే ప్రకృతి విపత్తుల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. రాజకీయ నాయకులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పార్టీలు రాబోయే ఎన్నికల గురించి పడే ఉత్సాహంలో పదో వంతు ఈ ప్రకృతి ఉత్పాతాల మీద పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది.

30 బిలియన్​ డాలర్ల ఆర్థిక నష్టం

ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలతో 30 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. బీమా వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా, ఈ నష్టాల్లో కేవలం 5.6 బిలియన్ డాలర్లు మాత్రమే కవర్ చేశారు. ధనిక దేశాల్లో బీమా వ్యవస్థ ఉన్నందున నష్టాల అంచనా తొందరగా వస్తున్నది. నష్టపోయిన వారికి కొంత ఉపశమనం కలుగుతున్నది. పేద దేశాల్లో ఇలాంటి భారీ నష్టాల నుంచి తేరుకోవడం చాలా కష్టం. ఆయా దేశాల ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. పర్యావరణ విధ్వంసం వల్ల, కర్బన ఉద్గారాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులు ఈ ఉత్పాతాలుగా పరిణమిస్తున్న సందర్భంలో, వాటి వల్ల భూతాపం పెరగడానికి కారణమైన కాలుష్యంలో ఎటువంటి పాత్ర లేని పేద దేశాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. కాబట్టి ధనిక దేశాలు ఈ నష్టం భరించాలని ఇటీవల జరిగిన కాప్​27 సదస్సులో తీర్మానం చేస్తూ, నష్ట నిధి ఏర్పాటు చేయాలని కూడా ఒప్పందం జరిగింది. అన్ని నష్టాలు బీమా చేయగలిగే కోవలోకి రావు కాబట్టి ఏర్పాటు చేయబోయే నష్ట పరిహార నిధి అటువంటి పరిణామాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వడగాల్పుల వంటి భవిష్యత్తులో పెను ప్రమాదాలు సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. 

విపత్తు నుంచి ఏ మూలా తప్పించుకోలే..

వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు ఆహార అభద్రత, కరువు, నివాసాల స్థానభ్రంశం, ప్రాణ నష్టం వంటి పరిణామాలకు కారణమవుతున్నాయి. వినాశకరమైన కరువు తూర్పు ఆఫ్రికాలో3.6 కోట్లకుపైగా ప్రజలను ప్రభావితం చేసింది. తూర్పు ఆఫ్రికాలో ప్రజలు కరువుతో బాధపడుతుండగా, పశ్చిమ ఆఫ్రికాలో నైజీరియా, కామెరూన్, మాలి తదితర దేశాల్లో 600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2022లో సంభవించిన కొన్ని విపత్తులు చాలా వేగంగా వచ్చాయి. ఫిబ్రవరిలో బ్రిటన్ లో తుఫాను యునిస్ వల్ల గాలి వేగం122 మైళ్లతో కొత్త రికార్డును నెలకొల్పింది. సెప్టెంబరులో కరేబియన్ ప్రాంతాన్ని, కెనడాను తాకిన ఫియోనా హరికేన్ కొద్ది రోజుల్లోనే 3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. బ్రెజిల్, చైనాలో కరువులు ఏడాదంతా కొనసాగి, వరుసగా 4 బిలియన్, 8.4 బిలియన్ డాలర్లు నష్టం కలిగించాయి. ప్రపంచంలోని ఏ మూల కూడా 2022 ప్రకృతి విలయాల నుంచి తప్పించుకోలేదు. 
- దొంతి నర్సింహా రెడ్డి,
పాలసీ ఎనలిస్ట్