సివిల్స్​లో పాలమూరు యువతికి థర్డ్​ర్యాంక్

సివిల్స్​లో పాలమూరు యువతికి థర్డ్​ర్యాంక్
  • ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా
  • తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
  • అనన్య రెడ్డికి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్​రెడ్డి

ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్–2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తాచాటారు. దాదాపు 50 మందికి పైగా  సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. అనిమేష్‌ ప్రధాన్‌ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులు చేజిక్కించుకున్నారు. 

1,016 మంది ఎంపిక 

జ‌న‌ర‌ల్ కేట‌గిరి కింద 347, ఈడ‌బ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ కేట‌గిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ పోస్టుల‌కు, 37 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల‌కు, 200 మంది ఐపీఎస్ పోస్టుల‌కు, 613 మంది సెంట్రల్ స‌ర్వీసెస్ గ్రూప్ ఏ పోస్టుల‌కు, 113 మంది గ్రూప్ బీ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు.

సీఎం రేవంత్ స్పెషల్​విషస్

సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా  సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.