ఇవి క్లీన్​ చేస్తున్నారా?

ఇవి క్లీన్​ చేస్తున్నారా?

ఇల్లు నీట్​గా లేకపోతే మనసుకు పట్టదు చాలామందికి. అందుకే టైమ్​ చూసుకుని మరీ రెగ్యులర్​గా అన్నీ చక్కగా సర్దుతుంటారు. గచ్చు తుడవడం, బూజు దులపడం.. ఇలా అన్నీ చేస్తారు. కానీ, కొన్ని ప్లేస్​లని  శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. అవేంటంటే...డోర్​ నాబ్స్​, హ్యాండిల్స్​, విండో హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ స్విచెస్​... వీటి క్లీనింగ్​ మీద దృష్టి పెట్టరు చాలామంది. దాంతో వీటిపై దుమ్ముధూళితో పాటు బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అందుకే వీటిని డిజ్​ఇన్ఫెక్టెంట్​ వైప్స్​తో లేదంటే యాంటీ– బ్యాక్టీరియల్ సొల్యూషన్​తో క్లీన్​ చేయాలి. మురికి పట్టిన బట్టల్ని లాండ్రీ బాస్కెట్స్​లో వేస్తాం. దాంతో వాటి మురికి, వాటిపై ఉన్న బ్యాక్టీరియా వంటి క్రిములు ఈ బాస్కెట్​కి అంటుకుంటాయి. అందుకనే వాటిని రెగ్యులర్​గా క్లీన్​ చేయాలి. ఇంటి మొత్తంలో ఎక్కువ  బ్యాక్టీరియా కిచెన్ స్పాంజ్​లోనే  ఉంటుంది. 2017లో జరిగిన ఓ స్టడీలో కిచెన్ స్పాంజ్ లో 362 రకాల బ్యాక్టీరియాను గుర్తించారట.

అందుకే ప్రతిరోజు స్పాంజ్​ని శుభ్రం చేయాలి. అలాగే వారానికోసారి వాటిని మారుస్తుండాలి.  బెడ్ మనుషులకే కాదు,  రకరకాల క్రిములకి కూడా  రెస్ట్​ ఇస్తుంది​. స్టడీల ప్రకారం కొన్ని వందల లీటర్ల చెమట మన శరీరం నుంచి బెడ్ పై చేరుతుంది. దానివల్ల బెడ్​పై క్రిములు పుట్టుకొస్తాయి. అందుకే బెడ్​ని ఎప్పటికప్పుడు దులుపుతూ శుభ్రం చేయాలి.  బెడ్​షీట్స్​ని వారానికి ఒకసారి ఉతకాలి. ఫోన్​ క్లీనింగ్​ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు.  కానీ సెల్​ఫోన్​పై టాయిలెట్​ కన్నా  వందల రెట్లు ఎక్కువ క్రిములుంటాయి. అవి శరీరంలో చేరితే  చాలా అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే  ఎప్పటికప్పుడు సెల్​ఫోన్​ని క్లీన్​ చేయాలి.  అలాగే  ప్రతిరోజూ వాటర్​ బాటిల్స్​​ని వేడినీళ్లతో కడగాలి. బాటిల్ ని కరచిపెట్టుకొని తాగే అలవాటు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కిచెన్​ సింక్​లో నీళ్లు పోసి, క్లీన్​ అయింది అనుకోవద్దు. గిన్నెలు తోమిన తర్వాత ఫుడ్​వేస్ట్ కొన్నిసార్లు సింక్​లోనే ఉండిపోతుంది. దాంతో అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి సింక్​ని ఏరోజుకారోజు బ్లీచింగ్​ సొల్యూషన్​ (నీళ్లు కలిపిన సోడియం హైపో క్లోరైట్​, సోడియం హైడ్రాక్సైడ్​ మిశ్రమం)తో క్లీన్​ చేయాలి. అంతేకాదు సింక్​ పైప్​లో ఫుడ్​వేస్ట్​ జమ కాకుండా చూసుకోవాలి.