మెదక్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మెదక్​లో  బీఆర్​ఎస్​ అభ్యర్థి  పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మెదక్, వెలుగు : మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా పద్మా దేవేందర్​ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్​ రావు సహకారంతో మెదక్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్,  పోలీస్​ ఆఫీస్​ బిల్డింగ్​ నిర్మాణం, మాతా శిశు సంరక్షణ కేంద్రం

మెయిన్​ రోడ్డు విస్తరణ, రైల్వే సౌకర్యం, బాలానగర్ నుంచి మెదక్ వరకు, మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట, ఎల్కతుర్తి, బాన్సువాడ, బోధన్​ వరకు నేషనల్​ హైవే లు, మెడికల్ కాలేజీ మంజూరయ్యాయన్నారు.  ఈ సందర్భంగా మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్  మల్లికార్జున గౌడ్, బీఆర్​ఎస్​  పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్ మేడి కల్యాణి, సుంకయ్య పాల్గొన్నారు. 

గిరిజనులపై కాంగ్రెస్ చిన్నచూపు

 కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తుందని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు  టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్ లో లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  గిజనుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులు పట్టించుకోలేదని ఆరోపించారు. మన ఆరాధ్య దైవం అయిన  సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను జరపలేదన్నారు.  గిరిజనుల అంతా ఏకతాటిపై ఉండి  బీఆర్ఎస్​కు  మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. మెదక్ బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​ రెడ్డి, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.