- బెల్ట్ షాపులకు లిక్కర్ డోర్ డెలివరీ
- సేల్స్ పెంచుకునేందుకు వైన్స్ ఓనర్ల ప్లాన్
- ఉదయం ఆర్డర్ తీసుకుంటూ.. సాయంత్రం ఆటోల్లో సరఫరా
- ఇష్టారాజ్యంగా రేట్లు పెంచిన నిర్వాహకులు
- అన్నీ తెలిసినా పట్టించుకోని ఎక్సైజ్ ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : లిక్కర్ సేల్స్ పెంచాలని ప్రభుత్వం చెబుతుండడం, ఆఫీసర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ కారణాలతో సూర్యాపేట జిల్లాలో ఇటీవల లిక్కర్ సేల్స్ పడిపోయాయి. దానిని భర్తీ చేసుకునేందుకు వైన్స్ ఓనర్లు సరికొత్త ప్లాన్‌కు తెరలేపారు. ఇప్పటివరకు చాటుమాటుగా బెల్ట్‌షాపులకు లిక్కర్‌ను అమ్మిన నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా కిరాణ సరుకుల మాదిరిగాడోర్ డెలివరీ చేస్తున్నారు. వైన్స్‌కు సంబంధించిన వ్యక్తులు ప్రతి రోజు ఉదయం బెల్ట్‌షాపులకు తిరుగుతూ ఏ లిక్కర్ కావాలో ఆర్డర్ తీసుకుంటున్నారు. తర్వాత ఆటోల్లో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ వద్ద గల ఓ వైన్స్ నిర్వాహకులు ఆటోలో లిక్కర్‌ను డోర్ డెలివరీ చేస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో వైపు భారీ మొత్తంలో లాభాలు పొందాలన్న ఆశతో రేట్లను ఇష్టారీతిన పెంచి అమ్ముతున్నారు.
సిండికేట్‌గా మారి అదనపు వసూళ్లు
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు లిక్కర్ అమ్మితే లాభాలు రావడం లేదని కొందరు వైన్స్ ఓనర్లు సిండికేట్‌గా మారి తమ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. కోదాడ సిండికేట్ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సిండికేట్ నిర్ణయించిన మేరకు వైన్స్‌లలో ప్రతి సీసాపై రూ.10 నుంచి రూ.50 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు ఇష్టపడే, ఎక్కువ సేల్స్ ఉండే బ్రాండ్లను వైన్స్‌ల్లో అమ్మకుండా బెల్ట్‌షాపులకు తరలిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.
పట్టించుకోని స్థానిక ఆఫీసర్లు
లిక్కర్‌ను డోర్ డెలివరీ చేయడం, ఎక్కువ రేట్లకు అమ్ముతున్న విషయం ఎక్సైజ్ ఆఫీసర్లకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సేల్స్ పెంచాలని ప్రభుత్వమే చెబుతుండడం, అక్రమాలకు పాల్పడ్డ వైన్స్ ఓనర్లకు అధికార పార్టీ లీడర్ల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ ఆఫీసర్లు సైతం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే స్థానిక ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో స్టేట్ విజిలెన్స్‌కు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు రంగంలోకి దిగుతున్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నా, రేట్లు ఇష్టం ఉన్నట్లు పెంచినా పట్టించుకోవడం లేదన్న కారణంతో ఇటీవల హుజూర్‌నగర్ సీఐని సస్పెండ్ చేశారు.