మీడియా జగత్తులో.. దూరదర్శన్ మహా ప్రస్థానం

దూరదర్శన్.. డీడీ.. ఈ పదాలు మన దేశ ప్రజలకు సుపరిచితాలు!! మన దేశంలో టీవీ వినియోగంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు చూసిన మొట్టమొదటి చానల్ డీడీ. 1959 సెప్టెంబరు 15న దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజలకు వార్తలు, సినిమాలు, సీరియళ్లు, వినోద కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్ లను  పరిచయం చేసిన తొలి మీడియా సంస్థ దూరదర్శనే. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, డీటీహెచ్, కేబుల్ టీవీ లేని రోజుల్లో దూరదర్శనే అన్నీ తానై దేశంలోని ప్రధాన భాషలు మాట్లాడే ప్రజలందరిని అలరించింది. దూరదర్శన్ ఏర్పాటై నేటితో 63 సంవత్సరాలు పూర్తయింది. 

ప్రస్థానం ఇదీ.. 

  • కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రసార భారతి సంస్థకు రెండు విభాగాలు ఉన్నాయి. అందులో ఒకటి కేంద్ర సమాచార, ప్రసార విభాగం. దీని పరిధిలోనే దూరదర్శన్ ఏర్పాటైంది. తొలుత చిన్నపాటి ట్రాన్స్మిటర్, చిన్న స్టూడియో నుంచి  1959 సెప్టెంబరు 15న  దీని ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 
  • 1965లో తొలిసారిగా న్యూస్ బులెటిన్ ప్రసారాలను డీడీ ప్రారంభించింది. చానల్ తొలి న్యూస్ రీడర్ ప్రతిమా పురి ప్రతిరోజు 5 నిమిషాల న్యూస్ బులెటిన్ ను చదివేవారు. 1967లో ఆమె స్థానంలో సల్మా సుల్తాన్ ను నియమించారు. 
  • 1982 నాటికి దేశంలోనే అతిపెద్ద టీవీ చానల్ గా డీడీ నేషనల్ అవతరించింది. 
  • 1982లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంతో కలర్ టెలివిజన్ లో డీడీ నేషనల్ ప్రసారాలు మొదలయ్యాయి. 
  • 1984లో దూరదర్శన్ డీడీ1, డీడీ2గా విభజితమైంది. డీడీ1 అనేది నేషనల్ న్యూస్ చానల్ గా, డీడీ2 అనేది సిటీ చానల్ గా ఏర్పడ్డాయి. 1994 నాటికి ఈ రెండింటికి డీడీ నేషనల్, డీడీ మెట్రో అని పేరు మార్చారు. 
  • డీడీ మెట్రో పేరును డీడీ న్యూస్ గా మార్చి 2003 నవంబరు 3న లాంచ్ చేశారు. ఇది 24 గంటల న్యూస్ సర్వీస్.
  • దూరదర్శన్ కు చెందిన హిందీ సీరియళ్లను ప్రసారం చేసేందుకు 2020 ఏప్రిల్ 13న డీడీ రెట్రో చానల్ ను ప్రసార భారతి ప్రారంభించింది. 
  • దూరదర్శన్ లో ప్రసారమైన ప్రధాన సీరియళ్లు, వినోద కార్యక్రమాల్లో మహాభారత్, హమ్ లోగ్, భారత్ ఏక్ ఖోజ్, శ్రీ కృష్ణ, మాల్లుడి డేస్, ఫౌజీ, నుక్కడ్ చెప్పుకోదగ్గవి.