తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. శివ‌నామ‌స్మర‌ణ‌తో మార్మోగిన ఆలయం

దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం తెరిచారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం 6:15 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు తెరిచారు.   ఈ సందర్భంగా ఆలయాన్ని 20 క్వింటాళ్ల పూలతో అలంకరించారు.  ఆలయ తలుపులు తెరిచే సమయానికి సుమారు ఎనిమిది వేల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు.  వచ్చే ఆరు నెలల పాటు భక్తులు ఈ ఆలయాన్ని  దర్శించుకునే అవకాశం ఉంటుంది.

భారీగా భక్తులు అక్కడికి చేరుకోవడంతో  హర్‌ హర్ మహాదేవ్ నామ కీర్తనలతో కేదార్‌నాథ్ ప్రాంతం మారుమ్రోగిపోయింది.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  యాత్రికులు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపారు.  ప్రతికూల వాతావరణం కారణంగా ఆ రాష్ట్ర సీఎం  పుష్కర్ సింగ్ ధామి అక్కడికి చేరుకోలేకపోయారు.

తీర్థయాత్ర మార్గంలో  విపరీతమైన మంచు కురుస్తున్నందున ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్‌నాథ్ యాత్ర కోసం యాత్రికుల నుండి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను స్వీకరించడాన్ని నిలిపివేసింది.  కేదార్‌నాథ్ మార్గంలో భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. అక్షయ తృతీయ సందర్భంగా యమునోత్రి ధామ్ నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. మరోవైపు ఏప్రిల్  27న బద్రీనాథ్ ధామ్ ఆలయం తెరుచుకోనుంది.  

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానం చేసేదే ఈ చార్‌ధామ్ యాత్ర.