మరోసారి ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ

మహబూబాబాద్ జిల్లా : అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనం నుంచి తిప్పలు తప్పడం లేదు. తరచూ ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో గ్రామాల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీలను, సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. చాలాచోట్ల అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు చాలా సార్లు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామాల్లోకి వెళ్తున్న ఆయన్ను అడ్డుకుని.. నిరసన తెలుపుతున్నారు ప్రజలు. 

తాజాగా మరోసారి ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగడుగునా నిరసన సెగలు పెల్లుబికాయి. కురవి మండలంలో రెండోరోజు కూడా రెడ్యానాయక్ కు నిరసనలు తప్పలేదు. మొగిలిచర్లలో పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేగా ఉండి తమ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారంటూ నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.