మరిపెడ,వెలుగు: అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే రేడ్యా నాయక్‌ను ఎలమంచిలి తండాలో శుక్రవారం రైతులు, స్థానికులు పలు సమస్యలపై నిలదీశారు. ఎలమంచిలి తండా,ఆనేపురం,వెంకట్య తండా,స్టేజి తండా జీపీల్లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎలమంచిలి తండాలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా స్థానిక రైతులు రుణమాఫీ ఎందుకు చేయలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
త్వరలోనే చేస్తారని ఎమ్మెల్యే సమాధానం దాటవేశారు. తండాలో సీసీ రోడ్లు అభివృద్ధి చేయలేదని,పెన్షన్ ఇవ్వడం లేదని, స్థానికులు నిలదీయడంతో అధికారులతో మాట్లాడి రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. స్టేజి తండా జిపిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, తాసీల్దార్ రాంప్రసాద్, సర్పంచులు పార్వతి, వీరన్న పాల్గొన్నారు.