మానుకోట ఊళ్లకు రైలు కూత .. డోర్నకల్ టు గద్వాల న్యూ రైల్వే లైన్ సర్వే పనులు షురూ

  • రూ.7.40 కోట్లు మంజూరు
  • రైల్వే ప్రాజెక్ట్ విలువ రూ.5330 కోట్లుగా అంచనా
  • పనులు షురూతో డోర్నకల్ జంక్షన్​కు మరింతగా ప్రధాన్యత

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​జిల్లాలోని పల్లెలకు రైలు కూత చేరువకానున్నది. డోర్నకల్​టు గద్వాల రైల్వేలైన్​పనుల సర్వేకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అనుమతించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.7.40 కోట్లను మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం రూ.5330 కోట్ల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. కాగా, ఈ సర్వే పూర్తయితే రైల్వేలైన్​296 కిలోమీటర్ల మేరకు విస్తరించనుంది. 

కొత్త రైల్వే లైన్​తో ప్రయోజనాలు..

సికింద్రాబాద్_విజయవాడ, హైదరబాద్​_ బెంగుళూరు మధ్య రైల్వే లైన్ ఉంది. ఈ రెండు మార్గాలను అనుసంధానం చేసే నూతన మార్గంపై దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నవి. డోర్నకల్, పాలేరు, కూసుమంచి, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల మీదుగా కొత్త రైల్వే లైన్ రానుంది. 

గతంలో కేవలం బస్సు సర్వీస్ ఉన్న ప్రాంతాలకే నూతనంగా రైల్వే మార్గం ఏర్పడనుంది. దీంతో ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు సులభంగా రైల్వే ప్రయాణం చేయవచ్చు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పొలిశెట్టిగూడెం, దాక్యాతండా, గూడూరుపాడు, ఎం.వెంకటాయపాలెం, అరకోడ్, చింతపల్లి, నల్లగొండ జిల్లాలోని తుమ్మలపల్లి, కొత్తగూడెం వరకు సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నట్లు రైల్వే ఆఫీసర్లు తెలిపారు.

డోర్నకల్ జంక్షన్ మరింత డెవలప్..

సికింద్రాబాద్​_ విజయవాడ రూట్​లో ఉన్న డోర్నకల్ రైల్వే జంక్షన్​కు ఇప్పటికే రెండు రైల్వే లైన్లు ఉండగా, అదనంగా విజయవాడ నుంచి సికింద్రాబాద్​కు వేస్తున్న మూడో రైల్వే లైన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు వేసే నూతన మార్గం  మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి మొదలు కానుండడంతో డోర్నకల్ రైల్వే జంక్షన్​కు మరింతగా ప్రయార్టీ పెరగనుంది. నూతన మార్గం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.