
ఇంటర్ బోర్డ్ లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ బోర్డ్ తప్పిదాల మూలంగా 25 మంది ఆత్మహత్యలు చేసుకొని,వేలాది విద్యార్థులు రోడ్డెక్కితే కనీసం భరోసా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని తెలిపారు.
అనుభవం లేని గ్లోబరిన అనే సంస్థ మూలంగా వేలాదిమంది ఇంటర్ విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని శ్రవణ్ అన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ లా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరిన సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు ఇచ్చిన విధానం పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విద్య,వైద్యం వంటి కీలక శాఖలపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని, పరీక్షల నిర్వహణ లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రవణ్ మండిపడ్డారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా సీఎం కేసీఆర్ కు ఇవేవీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పాలకులకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. మార్కుల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారన్నారు. అందుకు కారణమైన అశోక్ అనే అధికారిని భర్తరఫ్ చేయాలనిడిమాండ్ చేశారు.