కట్టకముందే కూలుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు

ఆదిలాబాద్ జిల్లాలో నాసిరకంగా డబుల్ ఇండ్ల నిర్మాణం
సైటుకు కూడా రాని ఆఫీసర్లు..
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
చిన్నవాన పడ్డా కురుస్తున్న ఇండ్లు

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: పేదల కోసం కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు గట్టిగా తోస్తే కూలిపోయేలా ఉన్నాయి. గోడలు పగుళ్లు బారుతున్నాయి. ఇండ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కాంట్రాక్టర్లు నాసిరకంగా కడుతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుని వారికి వంత పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలాచోట్ల నాసిరకంగా ఇండ్లు కడుతుండడంతో అందులో ఉండాలంటేనే లబ్దిదారులు భయపడే పరిస్థితులున్నాయి. ఒక్కో ఇంటికి రూ.5.30లక్షల ఖర్చుతో ఆదిలాబాద్ జిల్లాలో 4195 ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 3154 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లను పిలువగా 1740 ఇండ్లకు అగ్రిమెంట్ అయింది. 1210 ఇండ్లు ఇంకా నిర్మాణదశలో ఉండగా 447 ఇండ్లు పూర్తయ్యాయి.

ఆసిఫాబాద్ జిల్లాలో 1223 ఇండ్లు మంజూరవ్వగా 558 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 6601 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇండిపెండెంట్ ఇండ్లతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్ల తరహాలో ఇండ్లు కడుతున్నారు. నాణ్యతను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. పిల్లర్లు, బీమ్లు గాలిలో ఊగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు. చిన్న వానపడినా ఈ ఇండ్లు కురుస్తున్నాయి. ఇలాంటి ఇళ్లలో ఉంటే ప్రాణాలకు ముప్పు తప్పదని పేదలు భయపడుతున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం ఇసుక, కంకర, స్టీల్ ను వాడుతున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాల్సిన అధికారులకు కాంట్రాక్టర్ల నుంచి మామూలు అందుతున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో ఆధికారులు కనీసం సైట్ విజిట్ కూడా చేయడంలేదంటున్నారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది.

For More News..

కరోనాకు భయపడి పిల్లల్ని వద్దనుకుంటున్న కొత్త జంటలు

టిక్ టాక్ బ్యాన్ చేసిన అమెరికా

ఆన్‌లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం