పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఏడున్నరేళ్ల ఏండ్లయినా జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికీ ఇల్లు ఇవ్వలేదు. కొన్నిచోట్ల కట్టినవి కూడా కేటాయించలేదు. దీంతో నిర్మించిన ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ప్రతిపక్ష పార్టీలు, అర్హులైన పేదలు కలెక్టర్ కు విన్నవించారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ 3,394 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన డబుల్ ఇండ్ల నిర్మాణంలో పూర్తయినవి ఇప్పటికి 262 మాత్రమే. కడుతున్నవి1,669. పునాదులు కూడా తీయనివి 1,463 ఉన్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో మంథని మండలంలో 92, కాల్వ శ్రీరాంపూర్‌లో 170 మాత్రమే పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం అర్బన్, మంథని అర్బన్ తదితర ప్రాంతాల్లో స్థలం లేక ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు.
కాంట్రాక్టర్లు దూరం..
కట్టిన ఇండ్లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో మిగిలిన ఇండ్లు కట్టడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. నిర్మాణ వ్యయం పెరగడం, జీఎస్టీ తదితర ట్యాక్స్ లు ఎక్కువగా ఉండటం కూడా మరో కారణం. మరోవైపు ప్రభుత్వం కేటాయించిన డబ్బులు నిర్మాణాలకు సరిపోవడంలేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.30 లక్షలు కేటాయించింది. ఇంటికి 6 శాతం చొప్పున జీఎస్టీ కట్టాలి. ఒక్కింటికి రూ.30 వేలు జీఎస్టీ కింద పోతుంది. ఈ విధంగా 1000 ఇండ్లు కట్టాలంటే కాంట్రాక్టర్ జీఎస్టీ కింది రూ.3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇండ్లు నిర్మించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఎన్నాళ్లు ఎదురు చూసుడు
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీంకు భారీగా కేటాయింపులుంటాయని లబ్ధిదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా ఇండ్లకు బదులుగా భూమి ఉన్న వాళ్లకు రూ.3లక్షలు ఇస్తామని ప్రభుత్వం స్కీం మార్చి నాలుగేళ్లయినా ఇప్పటివరకు ఎవరికీ రూ.3 లక్షలు ఇచ్చింది లేదు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రంలో కొన్ని ఇండ్లు పూర్తయ్యాయి. వాటిని అర్హులకు ఇవ్వకపోవడంతో కట్టిన ఇండ్లు డ్యామేజ్ అవడంతోపాటు ఇండ్ల పరిసరాల్లో ముళ్లపొదలు పెరుగుతున్నాయి.
ఆందోళన ఉధృతం చేస్తం
ఏడున్నరేండ్లుగా డబుల్ బెడ్ రూంలు కడుతూనే ఉన్నారు. జిల్లాలో నిర్మించిన ఇండ్లు వెంటనే పేదలకు ఇవ్వాలి. నిర్మాణంలో ఉన్నవి పూర్తి చేయాలి. లేకపోతే అర్హులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తాం.
- సీపెల్లి రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి