కట్టుడే కాలే.. పంచుతరంట!
రెండేండ్లలో కానివి.. మూడునెల్లలో అయితయా?
తూప్రాన్లో డబుల్ ట్రబుల్
పూర్తి కాకముందే అప్లికేషన్లు తీసుకుంటున్న ఆఫీసర్లు
అది సాక్షాత్తు సీఎం నియోజకవర్గం. పెద్దసారు మాటిచ్చిన కొద్ది రోజులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాంక్షన్ అయినయి. వెంటనే ఫండ్స్ కూడా
వచ్చినయ్. ఇంకేముంది ఇండ్లు జల్దినే కంప్లీటై కొద్ది రోజుల్లోనే కొత్త ఇండ్లల్లోకి పోవచ్చనుకున్నరు సొంతిళ్లు లేని పేదోళ్లు. కానీ రెండేండ్లయినా ఇంకా ఇండ్లు కట్టుడు కాలే. సాంక్షన్ అయిన దాంట్ల సగం కూడా కంప్లీట్ చేయలే. కానీ ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు ’ఆఫీసర్లు పేదోళ్లనుంచి అప్పుడే అప్లికేషన్లు తీసుకున్నరు.
మెదక్/తూప్రాన్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్ పరిధిలోని తూప్రాన్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు 2018లో ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వాసుపత్రి ఓపెనింగ్ కోసం సీఎం తూప్రాన్‌కు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన పేదల కోసం 500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాటిని ఏడాది లోపు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సీఎం హామీ ఇచ్చిన కొన్నాళ్లకే ఇండ్లు సాంక్షన్ కాగా మంత్రి హరీశ్ రావు, మెదక్
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇద్దరు కలిసి ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు షురూ అయ్యాయి. కాగా పనులు నత్త నడకన సాగుతుండడంతో దాదాపు రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఇండ్లు కంప్లీట్ కాలేదు. ఇప్పటికి సుమారు 200 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా, మరో 300 ఇళ్లు పిల్లర్లు,స్లాబ్ల్ లెవల్లోనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నసెగ్మెంట్‌లోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం తీరు ఇలా ఉండడం గమనార్హం. సొంతిళ్లు లేక గుడిసెల్లో జీవిస్తున్న, అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేదలు తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో అని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నారు.
16 వార్డుల్లో వెయ్యి మంది..
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అల్లాపూర్, రావెళ్లి, పోతరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్, పడాలపల్లి గ్రామాలు ఉండగా మొత్తం 16 వార్డులు
ఉన్నాయి. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో సొంత ఇళ్లులేని నిరుపేద కుటుంబాలు సుమారు వెయ్యి వరకు ఉంటాయని అంచనా. ప్రస్తుతం 500 ఇళ్ల నిర్మాణం సాగుతుండడంతో అవి ఎవరికి దక్కుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దసరా వరకు ఎట్లయితయి?
ఇటీవల తూప్రాన్‌లో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రానున్న దసరా వరకు పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కాగా రెండేండ్ల కాలంలో సగం ఇండ్లు కూడా పూర్తి కాకపోగా, రానున్న మూడు నెలల కాలంలో మరో 300 ఇళ్ల నిర్మాణం ఎలా పూర్తి చేస్తారో ప్రజా ప్రతినిధులు, అధికారులకే తెలియాలి. ప్రస్తుతం పనులు జరుగుతున్నతీరు చూస్తుంటే ఆర్నెళ్లయినా పూర్తయ్యేలా కనిపించడం లేదు.
అప్పుడే అప్లికేషన్లు ..
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కాకున్నా అధికారులు హడావుడిగా అప్లికేషన్లు స్వీకరించడం గమనార్హం. ఇండ్లు నిర్మించకుండానే అప్లికేషన్లు తీసుకోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా తూప్రాన్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం ఇప్పటికే మూడు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారని ప్రజలు వాపోతున్నారు. 2018లో తూప్రాన్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఒకసారి, ఏడాది కిందట రెండో సారి, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత వారం రోజుల కింద మరోసారి ఇలా మూడుసార్లు అప్లికేషన్లు స్వీకరించారని వీటిలో వేటిని పరిగణలోకి తీసుకుంటారోనని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పొలిటికల్ లీడర్ల జోక్యంతో అసలైన పేద ప్రజలకు ఇల్లు దక్కకుండా పోతాయేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇండ్ల నిర్మాణం జల్ది కంప్లీట్ చేయాలని, పక్కాగా ఎంక్వైరి చేసి నిజంగా అర్హులైన పేద ప్రజలకు మాత్రమే ఇళ్ల పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కరోనాతోనే లేట్..
కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లేటైంది. లేకుంటే ఎప్పుడో అయిపోవు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు
దసరా వరకు పూర్తిస్థాయిలో ఇండ్లను కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తున్నం. పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నం.
‑నర్సింహులు, పంచాయతీరాజ్ డీఈ